Mahaa Daily Exclusive

  గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ఎంపీల సమరం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు…!

Share

కారేపల్లి, మహా: గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అనంతారపు వెంకటాచారితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రులలో 1000 గంటలు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు జారీ చేయలేదన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ వైద్యులను పారా మెడికల్ బోర్డు కింద తీసుకోని శిక్షణ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరి నుండి రూ.200లను డిడి కట్టించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నట్లు పేర్కొన్నారు.అనునిత్యం గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవ అందిస్తున్న గ్రామీణ వైద్యులకు రక్షణ కరువైందన్నారు.దశాబ్దాల కాలంగా మారుమూల గ్రామాలలో ప్రజలతో మమేకమై అనుభవజ్ఞులైన గ్రామీణ వైద్యులు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారన్నారు.గ్రామీణ వైద్యులు సకాలంలో స్పందించి అత్యవసర వైద్యం అవసరం ఉన్న వారిని సమీప పట్టణాల్లో గల ప్రధాన ఆసుపత్రులకు(అర్హత కలిగిన వైద్యుల వద్దకు)తరలించి అనేకమంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారన్నారు. కొంతమంది వేధింపుల కారణంగా గ్రామాలలో ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలు స్థానిక ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపి లకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలనే అంశంపై ఇటీవల హైదరాబాదులో దక్షిణాది రాష్ట్రాల గ్రామీణ వైద్యుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మరికొద్ది రోజుల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అందిస్తున్న ప్రాథమిక సేవలపై కనువిప్పు కల్పించుటకు ధర్నా చేసేందుకు కార్యచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.ఆర్ఎంపీలు లేకుంటే గ్రామాలలో ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడతారని గ్రామీణ వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి స్థానికంగా వారికి ఎటువంటి హాని కలగకుండా రక్షణ కల్పించాలని కోరారు.అదేవిధంగా గ్రామీణ వైద్యులు తమ అర్హతకు మించి వైద్యం చేయరాదని సూచించారు.

Latest