Mahaa Daily Exclusive

  పోలీస్‌ సేవలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు ఎస్సై అవగాహన

Share

మందమర్రి, మహా : పోలీస్‌ సేవలు, సైబర్‌ నేరాలపై విద్యార్థినీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మందమర్రి ఎస్సై రాజశేఖర్ సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ పాఠశాల (ఫిల్టర్ బెడ్) విద్యార్థులకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్‌ ఫ్లాగ్‌ డే) వారోత్సవాలను పురస్కరించుకొని మందమర్రి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ‘ఓపెన్‌హౌస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్‌ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. చట్టాన్ని గౌరవించడం, ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో కీలకంగా మారిన పలు అంశాలపై పోలీసులు సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాల తీరు, మోసగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఫిర్యాదు చేసేందుకు ఉన్న 1930 నంబరు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలు, భయంకరమైన పరిణామాలపై హెచ్చరించి, వాటికి దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు, షీ టీమ్‌ పనితీరు గురించి కులం కుశంగా వివరించారు. పోలీసు విధులు, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ వంటి విభాగాల బాధ్యతలను క్లుప్తంగా చెప్పుకొచ్చారు. ఓపెన్‌హౌస్‌లో భాగంగా, విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా పరిచయం చేశారు. స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది విధులు, బాధితులు ఫిర్యాదు ఇచ్చే విధానం, దానిపై విచారణ జరిగే పద్ధతిని వివరించారు.
పోలీసులు వినియోగించే సాంకేతిక పరికరాలైన సీసీ కెమెరాల ప్రాధాన్యం, ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌, ట్రాఫిక్‌ ఎక్విప్‌మెంట్‌, ముఖ్యంగా డయల్‌ 100 విధానం గురించి క్లుప్తంగా వివరించి, కాల్‌ చేసిన వెంటనే పోలీసులు ఎలా స్పందిస్తారో విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం, ఆయుధాల వినియోగాన్ని ప్రదర్శించి, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మాజీద్‌ ఖాన్‌, మిలింద్ కుమార్‌, ఇతర పోలీస్‌ సిబ్బంది, పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Latest