- కాల్పుల కలకలం.. కమలం కదం!
- డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపు.. ఉద్రిక్తత
- బీజేపీ స్టేట్ చీఫ్, ఈటలతో సహా నాయకుల అరెస్టులు
- గోరక్షకులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది: రామచందర్ రావు
హైదరాబాద్, మహా: గోరక్షకుడిపై కాల్పుల ఘటన రాజధానిలో రాజకీయం సెగ రాజేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ శ్రేణులు కదం తొక్కాయి. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో లక్డీకాపూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. గో సంరక్షకుడు సోనూసింగ్‌పై బుధవారం జరిగిన కాల్పుల ఘటనను నిరసిస్తూ బీజేపీ గురువారం ఆందోళనకు పిలుపునిచ్చింది. వందలాది మంది కార్యకర్తలు, నేతలు డీజీపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ వద్దే బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంఐఎం ఆగడాలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోరక్షకులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని, వారిపై కక్షగట్టి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని, గూండాలకు రక్షణగా నిలుస్తోందని ఆరోపించారు. బహిరంగంగా తుపాకీతో కాల్పులు జరుపుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు








