జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం కేవలం ఓ రాజకీయ ఫలితం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకం, నాయకత్వం చూపిన దిశా నిర్దేశం, క్రమపద్ధతిలో నడిపించిన ఎన్నికల వ్యూహాల ప్రతిఫలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం ఈ ఎన్నికలో కీలక పాత్ర పోషించింది.
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే పార్టీకి వచ్చిన ఈ గ్రాండ్ విక్టరీ, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వ సామర్థ్యాన్ని స్పష్టంగా చాటుతోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా పరిగణించిన ఆయన—సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆఫీస్ బేరర్స్‌తో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ, ప్రతీ దశలో స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమన్వయం పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఎన్నికల ప్రక్రియ మొత్తం టీపీసీసీ చీఫ్ రేయింబవళ్లు పని చేస్తూ, బూత్ వారీగా పర్యవేక్షణ చేపట్టడం, బూత్ మేనేజ్మెంట్ను శాస్త్రీయంగా అమలు చేయించడం—ఈ విజయం సాధించడంలో ప్రధాన భాగంగా నిలిచాయి. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఇచ్చిన మార్గదర్శకాలు, సీఎం–టీపీసీసీ అధ్యక్షుడు కలిసి నిర్వహించిన క్రమబద్ధమైన జూమ్ సమావేశాలు నేతల్లో సమగ్రత, కట్టుదిట్టమైన నిర్వహణను పెంచాయి.
ప్రాంతాలవారీగా వ్యూహాలు రూపొందించడం, స్థానిక నేతలతో అనుసంధానం పెంచడం, గ్రౌండ్ లెవెల్లో కేడర్‌కు స్పష్టమైన సూచనలు అందించడం అన్ని కలిసి పనిచేయడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రత్యేకంగా పోల్ మేనేజ్మెంట్లో కచ్చితత్వం పార్టీకి భారీగా పనిచేసిందని స్పష్టమవుతోంది.
ఈ ఫలితం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఉంచుతున్న విశ్వాసానికి ప్రతిబింబం. రాబోయే రోజుల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతం అవుతాయన్న సంకేతాన్ని కూడా ఈ ఎన్నిక ఇస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో వచ్చిన విజయంతో పార్టీ కేడర్ ఉత్సాహం రెట్టింపు కాగా, ప్రభుత్వం చేపట్టిన ప్రజానుకోళ్ల చర్యలకు ప్రజల మద్దతు మరింత బలపడిందని చెప్పడం అతిశయోక్తి కాదు.








