Mahaa Daily Exclusive

  చావు అంచుల నుండి సెల్ఫీ వేడుకోలు….

Share

* చావు అంచుల నుండి సెల్ఫీ వేడుకోలు.
* “అన్నా.. ఈ నష్టాలను ఎవరూ పూడ్చలేరు!”
* కన్నీటి సాగు.. కౌలు రైతు “విషాదాంతం.
* 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయిన యువ రైతు వీరన్న.
* “కౌలు కట్టలేని వాళ్లను ఆదుకోండి” అంటూ రైతు గుండెకోత.
* చావుకు ఎదురెళ్లి.. రైతుల కష్టాలను ఏకరువు పెట్టిన నేలకొండపల్లి రైతు.

నేలకొండపల్లి, మహా.

పచ్చని పొలాల్లో పది మందికి అన్నం పెట్టాల్సిన రైతన్న, అప్పుల ఊబిలో కూరుకుపోయి చావును శరణు కోరడం తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కుదిపేసే విషాద ఘటనగా మారింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరితండాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. కేవలం 27 ఏళ్ల వయసున్న ఓ యువ కౌలు రైతు, వ్యవసాయంలో వచ్చిన నష్టాలను భరించలేక, పురుగుల మందు తాగుతూ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లు తెప్పిస్తోంది. చావు బతుకుల మధ్య పోరాడుతూనే, తనలాంటి కౌలు రైతుల గోడును ప్రభుత్వానికి వినిపించడానికి అతడు చేసిన ఆవేదన నిండిన ప్రయత్నం అందరినీ కలచివేస్తోంది.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన బాణోత్ వీరన్న అనే 27 ఏళ్ల యువకుడు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నాడు. సొంత భూమి లేకపోయినా, సేద్యంపై ఉన్న మక్కువతో శంకరగిరితండా, ముదిగొండ మండలం మాధాపురంలో దాదాపు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎన్నో ఆశలతో పత్తి, మిర్చి, వరి పంటలను సాగు చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాడు. కానీ ప్రకృతి కన్నెర్ర చేయడం, సాగునీటి ఇబ్బందులు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. దాదాపు 15 లక్షల రూపాయల వరకు అప్పులు పేరుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో వీరన్న తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
అప్పుల వాళ్ళ ఒత్తిడి, కుటుంబ పోషణ భారమై శనివారం తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, మృత్యువు ఒడిలోకి జారుకుంటున్న ఆ క్షణంలో కూడా వీరన్న తన స్వార్థం చూసుకోలేదు. చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని, పురుగుల మందు తాగుతూనే తన గోడును వెళ్లగక్కాడు. “అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికీ ఏడుపు వస్తోంది. ఎన్నో నష్టాలు, ధరలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని, సబ్సిడీలు ఇవ్వాలని వేడుకున్నాడు. అంతేకాకుండా, పంట పండక కౌలు కట్టలేని దీన స్థితిలో ఉన్న రైతులను భూ యజమానులు కూడా మానవత్వంతో అర్థం చేసుకోవాలని కోరాడు. ఆ వీడియోలో వీరన్న పలికిన ప్రతి మాట వ్యవసాయం చేస్తున్న ప్రతి సగటు రైతు ఆవేదనకు అద్దం పట్టింది.
అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న స్థానికులు వీరన్నను గమనించి వెంటనే స్పందించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరన్న ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు. పచ్చగా ఉండాల్సిన కుటుంబంలో అప్పుల బాధ చిచ్చు రేపిందని, ప్రభుత్వం తమను ఆదుకుని వీరన్న ప్రాణాలు కాపాడాలని వారు వేడుకుంటున్నారు. ఈ ఘటన కౌలు రైతుల బతుకులు ఎంత దయనీయంగా మారాయో మరోసారి సమాజానికి చాటిచెప్పింది. వీరన్న సెల్ఫీ వీడియో ఇప్పుడు అధికారుల కళ్లు తెరిపిస్తుందా, ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా అనేది వేచి చూడాలి.

Latest