- పార్లమెంట్ సెషన్స్ షురూ
- రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రధాని మోదీ స్వాగతం
- తొలి రోజు లోక్‌సభ ముందుకు రెండు బిల్లులు
ఢిల్లీ, మహా: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల గంట చేపట్టగా.. విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ కొంత సేపు వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభం కాగా.. పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలా తయారీపై కొత్త సెస్ విధించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు.
కొత్త ఛైర్మన్‌కు ప్రధాని మోదీ స్వాగతం..
ఈ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని స్వాగతం పలికారు. ఛైర్మన్‌గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. గవర్నర్‌గా ఆయన పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు. పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పటి నుంచి ఆయనను చూస్తున్నా. ఆయన వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శం’’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే సభ జరగాల్సిన తీరు గురించి సభ్యులకు సూచనలు చేశారు. పేదలు, బడుగువర్గాల జీవితాలు మెరుగుపడేలా చర్చ ఉండాలన్నారు. క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. ఈ సమావేశాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. దిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్లపైనా చర్చించాలని కోరాయి. అయితే ఈ అంశాలపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. మరోవైపు అణు ఇంధన బిల్లు-2025ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు ఉన్నత విద్య, మరో 8 బిల్లులు సభకు రానున్నాయి. సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు 20 రోజులపాటు (పని దినాలు) జరుగుతాయి. కానీ ఈసారి వాటిని 15 రోజులకే కుదించారు.








