- అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే.. అప్పుడే డీకే సీఎం
- హైకమాండ్ పిలిస్తే ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం
- కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన కామెంట్స్
- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి బ్రేక్‌ఫాస్ట్
కర్ణాటక, మహా: కర్ణాటకలో సీఎం సీటుపై రగడ కొనసాగుతున్న వేళ.. మరోసారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. అనంతరం డీకే శివకుమార్‌కు సీఎం పదవిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే.. అప్పుడే డీకే సీఎం అవుతారన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికల పైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలే పార్టీ ప్రధాన లక్ష్యమని ఇరువురు నేతలు పేర్కొన్నారు.
ఇద్దరం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం..
అల్పాహారం అనంతరం డీకేతో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రైతుల సమస్యలు సహా పలు ఇతర విషయాలపైనా చర్చించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఈ విషయాల్లో చర్చలు జరపడానికి పార్టీ హైకమాండ్ పిలిస్తే తాము ఇద్దరం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంలోని నేతలంతా ఐక్యంగా ఉన్నామని.. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నామన్నారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. డిసెంబర్ 8న కాంగ్రెస్ ఎంపీల సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.







