Mahaa Daily Exclusive

  * మైదానంలో మెస్సీ.. పాలనలో రేవంత్ విజయం…

Share

మెస్సీ టూర్‌తో రాజకీయంగా పైచేయి!
* విపక్షాల విమర్శలకు చెక్ పెట్టిన ‘మెస్సీ’ సక్సెస్.
* మైదానంలో మెస్సీ.. పాలనలో రేవంత్ విజయం.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ వేదికగా జరిగిన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన కేవలం ఒక క్రీడా సంబరంగానే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందన్న విపక్షాల ప్రచారాన్ని ఈ ఒక్క ఈవెంట్ పటాపంచలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మక సవాలుగా స్వీకరించి, నిర్వహణలో తనదైన ‘అడ్మినిస్ట్రేటివ్ మార్క్’ చూపించడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెంట్లతో గ్లోబల్ అటెన్షన్ డ్రా చేస్తే, రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ డిప్లమసీ ద్వారా హైదరాబాద్‌ను విశ్వవేదికపై నిలబెట్టి తన శైలి వేరని చాటిచెప్పారు.
రాజకీయంగా చూస్తే ఈ ఈవెంట్ విజయం రేవంత్ రెడ్డికి రెండు విధాలుగా కలిసివచ్చింది. మొదటిది, శాంతిభద్రతల నిర్వహణ. భారీ జనసందోహం ఉండే ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించగల సత్తా తమ ప్రభుత్వానికి ఉందని నిరూపించడం ద్వారా, పాలనాపరమైన పట్టును ఆయన ప్రదర్శించారు. కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో జరిగిన గందరగోళంతో పోల్చి చూస్తే, హైదరాబాద్‌లో కనబరచిన ‘జీరో కందరగోళం’ విధానం రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా పెంచింది. ఇది పెట్టుబడిదారులకు, నగర వాసులకు ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించే అంశం.
రెండవది, ‘తెలంగాణ రైజింగ్’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. రాహుల్ గాంధీ, మెస్సీలతో ఒకే వేదికపై నిలవడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తీసుకురావడంలో రేవంత్ కృతకృత్యులయ్యారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మాటలతో కాకుండా, చేతలతో సమాధానం చెప్పినట్లయింది. హైదరాబాద్ అభివృద్ధి, గ్లోబల్ ఇమేజ్ విషయంలో రాజీపడేది లేదని, తన విజన్ స్పష్టంగా ఉందని ఈ ఈవెంట్ ద్వారా సీఎం స్పష్టమైన సంకేతాలు పంపారు. వెరసి, మెస్సీ టూర్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఒక ‘పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్’గా అభివర్ణించవచ్చు.

Latest