హైదరాబాద్, మహా.
జిల్లాలోని జఫర్‌గఢ్‌లో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభియోగంపై ఈ చర్య తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత-2023లోని 152వ నిబంధనతో పాటు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)-1967లోని 13, 39 నిబంధనల కింద ఇన్నయ్యపై కేసులు నమోదు చేశారు. జఫర్‌గఢ్‌లోని అనాథాశ్రమంలో సోదాలు నిర్వహించిన అధికారులు అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల భావజాల వ్యాప్తికి ఇన్నయ్య సహకరిస్తున్నారని దర్యాప్తు సంస్థ ప్రకటించింది. అరెస్టు అనంతరం ఆయనను హైదరాబాద్ తరలించారు. నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. గతంలో విప్లవ పార్టీలో పనిచేసిన ఇన్నయ్య, ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ అరెస్టు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.







