* డిసెంబర్ 26 నుంచి పెరగనున్న రైలు టికెట్ ధరలు.
* ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లలో పెరగనున్న ఛార్జీలు.
* నిర్వహణ ఖర్చుల దృష్ట్యా రైలు టికెట్ల పెంపు.
* కిలోమీటరుకు రెండు పైసల వరకు వడ్డన.
* సామాన్యుడి రైలు ప్రయాణం మరింత ప్రియం.
* ఆదాయం పెంపుపై రైల్వే శాఖ నజర్.
* టికెట్ ధరల పెంపుతో 600 కోట్ల అదనపు రాబడి.
హైదరాబాద్, మహా.
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. పెరిగిన నిర్వహణ ఖర్చుల పేరుతో టికెట్ ధరలను పెంచుతూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు డిసెంబర్ 26వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉపయోగించే రైల్వే సేవలపై ఈ ఆర్థిక భారం పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్త ధరల వివరాల ప్రకారం, జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో 215 కిలోమీటర్ల వరకు ఎటువంటి మార్పు ఉండదు. అయితే, ప్రయాణం 215 కిలోమీటర్లు దాటిన పక్షంలో ప్రతి కిలోమీటరుకు ఒక పైసా చొప్పున అదనంగా వసూలు చేస్తారు.
ఇక నాన్ ఏసీ, ఏసీ కోచులలో ప్రయాణించే వారిపై భారం మరింత పెరగనుంది. ఈ రెండు కేటగిరీలలో ప్రతి కిలోమీటరుకు రెండు పైసల చొప్పున ధరలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు కంటే సుమారు 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా పెరుగుతున్న మ్యాన్ పవర్ (మానవ వనరుల) వ్యయమే కారణమని పేర్కొంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ తన సిబ్బంది మరియు ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఏకంగా 2,63,000 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు వెల్లడించింది.
ఈ భారీ ఖర్చును భర్తీ చేయడంతో పాటు ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి కార్గో లోడింగ్ ఛార్జీలు, టికెట్ ధరలను పెంచక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ధరల పెంపు ద్వారా రైల్వే శాఖకు ఏటా అదనంగా 600 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరనుంది. గత జూలై నెలలో కూడా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ కోచ్‌లకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అన్ని విభాగాల్లో ధరలు పెరగడం నిత్యం రైళ్లలో ప్రయాణించే వారికి మింగుడుపడని అంశంగా మారింది. డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం దూర ప్రాంత ప్రయాణికులపై ప్రభావం చూపనుంది.







