Mahaa Daily Exclusive

  గజపతుల ‘విశ్వ’రూపం.. ప్రగతికి ‘అశోక’ హస్తం.

Share

* గజపతుల ‘విశ్వ’రూపం.. ప్రగతికి ‘అశోక’ హస్తం.
* ఏవియేషన్ సిటీకి రూ.1000 కోట్ల భూరి విరాళం!
* భీమిలి గడ్డపై ‘అలక్ మహారాజా’ ఏవియేషన్ హబ్!
* విలువల రాజకీయాలకు నిలువుటద్దం.. దేశాభివృద్ధి కోసం 160 ఎకరాల భూమి ధారపోసిన అశోక గజపతిరాజు కుటుంబం.
* జీఎంఆర్ – మాన్సాస్ జంటగా విద్యా విప్లవం.. భోగాపురం చెంతన వెయ్యి కోట్ల భూదానం!
* సంపాదనే ధ్యేయంగా సాగుతున్న రాజకీయాల్లో అరుదైన ‘ధర్మరాజులు’.. తండ్రి బాటలో అదితి గజపతి అడుగులు.

హైదరాబాద్, మహా.

నేటి రాజకీయ యవనికపై పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం, రూపాయి పెట్టుబడితో వంద కోట్లు సంపాదించడమే లక్ష్యంగా సాగుతున్న ‘వ్యాపార’ ధోరణికి భిన్నంగా, విజయనగర గజపతుల రాజవంశం మరోసారి తమ ఉదాత్తతను చాటుకుంది. తన స్వార్జితం కంటే దేశ ప్రయోజనమే మిన్న అని భావించే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక గజపతిరాజు కుటుంబం, ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చేసే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలి ప్రాంతంలో ఉన్న సుమారు రూ. 1000 కోట్ల విలువైన భూమిని ‘ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ’ నిర్మాణం కోసం విరాళంగా ప్రకటించి, తమ త్యాగనిరతికి సాటిలేదని నిరూపించుకున్నారు. రాజరికపు హోదాను ప్రజాసేవలో విలీనం చేసిన ఈ కుటుంబం, నైతిక విలువలు నశించిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చల్లని వెలుగురేఖలా నిలుస్తోంది.

*త్యాగధనుల వారసత్వం.. ప్రగతి పథంలో ఉత్తరాంధ్ర*

విజయనగరం అంటేనే విద్యా దానాలకు, భూ దానాలకు పురిటిగడ్డ. ఆ వంశ పరంపరను పుణికిపుచ్చుకున్న అశోక గజపతిరాజు, నేటి కలికాలపు రాజకీయాల్లోనూ తన నిబద్ధతను చాటుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నం – విజయనగరం సరిహద్దుల్లో అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణానికి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా భారీ భూదానానికి శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద ఉన్న అత్యంత ఖరీదైన సుమారు 136.63 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయిస్తూ, గజపతుల వారసురాలు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చొరవ తీసుకున్నారు. ఈ భూమిని ఏవియేషన్ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు దేవదాయ శాఖ అనుమతులు జారీ చేయగా, ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువరించడం గమనార్హం.
జీఎంఆర్ – మాన్సాస్ భాగస్వామ్యంలో సరికొత్త చరిత్ర
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇటీవలే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్ గ్రూప్ , మాన్సాస్ ట్రస్ట్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మొత్తం 160 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఈ క్యాంపస్, భారత విమానయాన రంగంలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. పూసపాటి వంశీయుడైన అలక్ మహారాజా గజపతి హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజం పడగా, ఇప్పుడు అదే మహనీయుని పేరును ఈ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి పెట్టాలని అదితి గజపతిరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తండ్రి అశోక గజపతిరాజు కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు కన్న కలలను సాకారం చేస్తూ, ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ హబ్‌గా మారేందుకు తమ వంతు సహకారాన్ని గజపతి కుటుంబం సంపూర్ణంగా అందిస్తోంది.

*ఉపాధి.. ఆర్థిక వృద్ధికి బాటలు*

ఈ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర యువతకు అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. కేవలం సాధారణ విద్యా సంస్థలకే పరిమితం కాకుండా, ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పైలట్ శిక్షణ కేంద్రం, ఏవియేషన్ అకాడమీ మరియు విమానాల నిర్వహణ, మరమ్మతుల విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మన దేశంలో విమానాల మరమ్మతుల కోసం విదేశీ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది, కానీ ఈ భూమిలో అధునాతన ఎంఆర్‌ఓ వసతులు ఏర్పడితే, అది దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా వేలాది మంది టెక్నికల్ నిపుణులకు ఉపాధి కల్పిస్తుంది. భోగాపురం విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఈ ఎడ్యుకేషన్ సిటీ రావడం వల్ల ఈ ప్రాంతపు ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి.

*ఆదర్శ రాజకీయాలకు నిలువుటద్దం*

గజపతుల కుటుంబం తరతరాలుగా మాన్సాస్ ట్రస్ట్ ద్వారా వేల ఎకరాలను విద్యా సంస్థలకు, ఆస్పత్రులకు దానం చేసిన చరిత్రను అశోక గజపతిరాజు మరియు అదితి గజపతిరాజులు నిరంతరం కొనసాగిస్తున్నారు. అధికారం కోసం అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టే వారు, భూ కబ్జాలకు పాల్పడే నాయకులతో వ్యవస్థ నిండిపోయి ఉండగా, వెయ్యి కోట్ల ఆస్తిని చిరునవ్వుతో ప్రజాహితం కోసం వదులుకోవడం ఒక చారిత్రక ఘట్టం. రాజకీయాల్లో ఉండీ కూడా సొంత ఆదాయాన్ని పెంచుకోకుండా, ఉన్నదాన్నే సమాజం కోసం ధారపోసే వీరి తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దేశాభివృద్ధి పట్ల తమకు ఉన్న నిబద్ధతను మరోసారి చాటుకున్న గజపతి కుటుంబం, భావితరాల నాయకులకు నిజమైన స్ఫూర్తిప్రదాతగా నిలుస్తోంది.

Latest