తమిళనాడులోరాజకీయ పునరేకీకరణ
అమిత్ షాతో వేర్వేరుగా భేటీ అయిన టీటీవీ దినకరన్, ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమితో జతకడుతున్న పార్టీలు..
న్యూఢిల్లీ, మహా : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తన నివాసంలో కలిశారు. వీరిద్దరి సమావేశం దాదాపు 15 నిమిషాల పాటు సాగింది. ఇటీవల ఏఐఏడీఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) ఢిల్లీలో షాను కలిసిన విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమితో దినకరన్ జతకట్టడాన్ని పళనిస్వామి అంగీకరించిన నేపథ్యంలో షాతో దినకరన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
దినకరన్ గతంలో ఈపీఎస్ నాయకత్వాన్ని తోసిపుచ్చారు. అయితే ఇటీవల జరిగిన ఏఎంఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో తన వైఖరి మార్చుకున్నారు. “శత్రువులను” ఓడించి “అమ్మ పాలనను” తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పొత్తుకు సిద్ధమని ప్రకటించారు.
తమిళనాడు దక్షిణ జిల్లాల్లో తేవర్ సామాజిక వర్గ ఓటర్లు అధికం. దాదాపు 35 నియోజకవర్గాలలో వీరి ఓటు బ్యాంకు ఎక్కువ. వీరంతా దినకరన్ మద్దతుదారులు. దీంతో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓట్లు పడతాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
ఎన్డీఏ కూటమితో దినకరన్ జతకట్టడంపై ఢిల్లీలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు డీఎంకేకు వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో తాము చేతులు కలిపేందుకు సిద్ధమని పళనిస్వామి సమాధానమిచ్చారు. అయితే ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), వీకే శశికళ విషయంలో విముఖత చూపినట్లు సమాచారం. దినకరన్ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయకపోవచ్చని, ఆయన రాజ్యసభ సీటు ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. మొత్తంమీద ఏఎంఎంకే చేరిక ఎన్ డీఏను మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఈ కొత్త పరిణామం నటుడు విజయ్ తమిళగ వెట్రీ కజగం (టీవీకే)పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి భేటీ..
ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఇడప్పాడి కె. పళనిస్వామి బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన నివాసంలో కలిశారు. భేటీ అనంతరం ఆయన న్యూఢిల్లీ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడారు. పుదుక్కోట్టైకు వచ్చినపుడు అమిత్ షాను తాను కలుకలేకపోయినందుకు ఇప్పుడు కలవాల్సి వచ్చిందని చెప్పారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఇద్దరం చర్చించామని చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తుల గురించి చర్చ జరగలేదన్నారు. తమిళనాడులో ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేయడమే తమముందున్న ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరించిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకోనని కూడా చెప్పారని పళనిస్వామి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలలో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు.. “మా కూటమిలోకి కొన్ని పార్టీలను చేర్చుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. పీఎంకే మా కూటమితో జతకడుతుందని ఆశిస్తున్నా. పొత్తుకు ఆ పార్టీ ఒకే చెబితే ఆ విషయం మీతో తప్పకుండా పంచుకుంటా’’ ” అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి అధికార డీఎంకేని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.








