Mahaa Daily Exclusive

  జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులపై దుమారం: సొంత ప్రభుత్వంపైనే జగ్గారెడ్డి అసహనం

Share

  • జర్నలిస్టుల అరెస్టులపై దుమారం
  • సొంత పార్టీపై జగ్గారెడ్డి అహసనం
  • అలా చేయడం మంచిది కాదని వ్యాఖ్య

హైదరాబాద్, మహా : మహిళా ఐఏఎస్‌ను కించపరిచేలా ఆరోపణలు చేశారని, కథనాలు ప్రచారం చేశారని కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ( సీసీఎస్) కేసు నమోదైంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులో చేస్తున్నారని కేసు నమోదైంది. ఈ కేసులపై విచారణ చేపట్టడానికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కేసుల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ అధికారులు.. మంగళవారం (జనవరి 13) అర్ధరాత్రి పలువురు జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో దుమారం చెలరేగింది. ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

అరెస్టులు వెంటనే ఆపండి

జర్నలిస్టుల అరెస్ట్‌ను వెంటనే ఆపాలని సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డికి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ మీడియాలో వచ్చిన అసత్య కథనాలను ఇప్పటికే ఖండించినట్లు తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ నాయకులు.. అధికారులపై మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేయడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. అయితే మీడియా అనుసరించే కొన్ని చర్యలు నాయకులు, అధికారులు సహా ఎవరికైనా ఇబ్బందేనని చెప్పారు. ఇలాంటి వాటిని అందరూ ఖండించాల్సిందేనని అన్నారు. అయితే ఈ కథనాలకు సంబంధించి జర్నలిస్ట్‌‌లను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మంచిది కాదని జగ్గారెడ్డి చెప్పారు.

అలా చేస్తే బాగుండేది

అరెస్టులు చేయకుండా.. జర్నలిస్ట్‌లకు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకుంటే బాగుండేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలా జర్నలిస్ట్‌లను అర్థరాత్రి అరెస్ట్ చేయడం వల్ల వారు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వారి అరెస్ట్ వల్ల రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. ఇలా జరగడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. జర్నలిస్ట్‌ల అరెస్ట్‌లను వెంటనే ఆపాలన్న ఆయన ఈ విషయాన్ని సిట్ బృందం, డీజీపీ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest