Mahaa Daily Exclusive

  కమ్యూనిస్టులు ఏకమైతే అధికారం ఖాయం: సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి ధీమా!

Share

  • కమ్యూనిస్టులు ఏకమైతే అధికారం చేపట్టడం అసాధ్యమేమి కాదు
  • సిపిఐ పాటల సిడి ఆవిష్కరణ సభలో జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి

హైదరాబాద్, మహా : కమ్యూనిస్టులంతా ఏకమైతే అధికారం చేపట్టడం అసాధ్యమేమి కాదని, ఇందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి వామపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ఈనెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిపిఐ శత వసంతాల ప్రస్థానం సందర్భంగా తెలంగాణ అభ్యుదయ రచయిత సంఘం (అరసం) ఆధ్వర్యంలో కవి గడ్డమీది చంద్రమోహన్ గౌడ్ రచించిన “ చలో ఖమ్మం” ఆరు గీతాలతో కూడిన సిడిని పల్లా వెంకట రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ నాడు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో సిపిఐ, ప్రజా సంఘాలు సముచిత స్థానాన్ని పోషించారని పేర్కొన్నారు. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్న నినాదంతో మొక్కవోని దీక్షతో ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ అని, ఆ తర్వాత దేశ అభివృద్దిలో ప్రజల ఆర్ధిక స్వావలంభన కోసం సంక్షేమ పథకాల అమల్లో కూడా పార్టీ క్రీయాశీలక పాత్ర పోషించిందన్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిపిఐ ఉద్యమ చరిత్రతో గడ్డమీది చంద్రమోహన్ గౌడ్ పాటలను రచించడం అభినందనీయమన్నారు.

కందిమళ్ల ప్రతాప రెడ్డి మాట్లాడుతూ అక్షర జ్ఞానం లేని ప్రజల్లో తమ పాటలు, రచనల ద్వారా చైతన్యం నింపిన ఘన చరిత్ర ఇప్టా, ప్రజానాట్య మండలిదేనని అన్నారు. కవులు కళాకారులు తమ పాటలు, రచనల ద్వారా ప్రజలను మరింత చైతన్యపర్చేవిధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాజ్జీ మాట్లాడుతూ కొంత మంది దోపిడీదారులకు, పెట్టుబడిదారులకు నిలయమైన సినీ రంగంలో నిలదొక్కుకుని మొక్కవోని దీక్షతో తనకు పోరాటం చేసే శక్తిని ఇచ్చింది ప్రజానాట్యమండలేనని అన్నారు. కార్యక్రమంలో గాయకులు డాక్టర్ సూర్యప్రకాశ్, ఆరెల్లి రవి, హేమలత తదితరులు పాల్గొన్నారు.

Latest