హైదరాబాద్:
రాష్ట్ర కేబినెట్ లోని మంత్రిపై ఎన్టీవీ మీడియాలో ప్రసారమైన కథనంలో భాగంగా సీనియర్ జర్నలిస్టులైన దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ ను అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అస శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి నారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రసారమైన వార్తకు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారంటూ సుధీర్ చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోవాలని వారన్నారు. సంబంధంలేని వారిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అన్యాయమని అన్నారు. ఆసుపత్రిలో అందరూ చూస్తుండగానే సుధీర్ మెడపై చేతులు వేసి బలవంతంగా తీసుకువెళ్లడం సమంజసం కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీటివి జర్నలిస్టులపై పోలీసులు ప్రవర్తించినట్టే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని వారన్నారు. మీడియాలో ఒక మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసారం చేసిన కథనంలో ఎవరి భాస్వామ్యం ఉందొ వారిని ఖచ్చితంగా శిక్షించాలని , అయితే సంబంధం లేని జర్నలిస్టులను అరెస్ట్ చెయ్యడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అయితే మీడియా కూడా ఒక కథనం ప్రచురించే ముందు ఆ కథానానికి ఉన్న వాస్తవికతను, తరువాత జరుగబోయే పరిణామాలను ఆలోచించాలని, ఒక మహిళా అధికారిపై ఆరోపణలు చేసే ముందు నిజ నిజాలు నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందని వారు గుర్తు చేశారు. వ్యక్తి స్వేచ్ఛకు భాగం కలిగించేలా జర్నలిస్టులు వార్తలు రావడం సబబు కాదని వారు పేర్కొన్నారు. ఈ కేసులో భాగమైన వారిని ఖచ్చితంగా శిక్షించాలని, అయితే సంబంధంలేని జర్నలిస్టులను వేధించడం సరైంది కాదని వారన్నారు.








