Mahaa Daily Exclusive

  పురపాలక పోరుకు బీజేపీ ‘మిషన్ 70’: 5 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలే లక్ష్యం.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు!

Share

  • 5 కార్పొరేషన్ లు 70 మునిసిపాలిటీలు
  • బీజేపీ లక్ష్యం : రాంచందర్ రావు
  • ఎన్నికల వ్యూహంపై కీలక నేతలతో భేటీ అయిన అధ్యక్షుడు

హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని 70 మునిసిపాలిటీలు, 5 మునిసిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే లక్ష్యంతో బీజేపీ పురపాలక ఎన్నికల్లోకి వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. పురపాలక ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలతో బుధవారం భేటీ అయిన రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ పార్టీ వ్యూహాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 60 శాతం మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నామని, కనీసం 5 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్లమెంట్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తాచాటామని, మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ ఎప్పటి నుంచో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సాయంత్రానికి అన్ని ప్రాంతాల నుంచి పూర్తిస్థాయి నివేదిక అందుబాటులోకి వస్తుందని. వెంటనే పార్టీ కమిటీ సమావేశంలో చర్చించి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కేవలం ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఆధారపడ్డాయని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒకటేనని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తన సత్తా చాటుతుందని ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర మంత్రి, ఎన్నికల ఇన్‌చార్జ్ అశీష్ షెలార్, రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ కో-ఇన్‌చార్జ్ అశోక్ పర్ణామి, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం, అలాగే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కమిటీ దిశానిర్దేశం చేసింది.

Latest