- ప్రజలను విస్మరించిన బడ్జెట్
- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్
- షేర్ మార్కెట్ కుప్పకూలింది బడ్జెట్ వల్లే – అఖిలేష్
ఢిల్లీ, మహా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక, సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని ఆయన ఆదివారం విమర్శించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. “ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూలుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచివున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు… వీటన్నింటినీ బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్, భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వ్యవహరిస్తోంది” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రాహుల్‌తో పాటు ఇతర విపక్ష నేతలు కూడా బడ్జెట్‌పై పెదవివిరిచారు. వృద్ధిని పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించడానికి ఇందులో సరైన సంస్కరణలు లేవని విమర్శించారు.
స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్టే కారణం
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరో అడుగు ముందుకేసి, స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్టే కారణమని ఆరోపించారు. “బీజేపీ బడ్జెట్ ఫలితం ఇదిగో.. షేర్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. ఆదివారం మార్కెట్ తెరుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు, అది ఇంకా ఎంత పడిపోతుందన్నదే అసలు ప్రశ్న అని మేము ముందే చెప్పాం” అని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కేవలం 5 శాతం మంది ప్రజల కోసమేనని, కమీషన్లు దక్కించుకోవడానికి, బీజేపీ సొంత వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే దీన్ని రూపొందించారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. “ఇది బీజేపీ తరహా అవినీతికి కంటికి కనిపించని లెక్కల చిట్టా” అని అఖిలేష్ అభివర్ణించారు.







