* ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక.
* రూ.700 కోట్లతో రామప్ప శైలిలో ఓంకారేశ్వరాలయం.
* నదిలోకి 5 టీఎంసీల గోదావరి జలాలు.
హైదరాబాద్, మహా.
“ఓట్లు, నోట్ల కోసం మేము మూసీ నదిని అభివృద్ధి చేయడం లేదు.. ఈ నగరాన్ని కాపాడాలనే పవిత్ర లక్ష్యంతో, భగవంతుడి ఆశీస్సులతో ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం. దశాబ్దాల పాపాన్ని కడిగేసే ఈ పుణ్యకార్యాన్ని ఎవరైనా రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చూపిస్తుంది” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఓంకారేశ్వర ఆలయానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మూసీ పునరుజ్జీవనం అనేది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, అది తెలంగాణ ఆత్మగౌరవానికి, భవిష్యత్ తరాల ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసరమైన చర్య అని ఉద్ఘాటించారు.
ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత చారిత్రక వీరభద్ర మచిలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయ శిల్పకళా రీతిలో నిర్మించనున్న ఓంకారేశ్వర ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ తప్పిదాల వల్ల హైదరాబాద్ నగరం కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని, మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించడం దైవ నిర్ణయమని, గత పాలకులు ఎందరు ప్రయత్నించినా సాధ్యం కాని ఈ పనిని తమ ప్రభుత్వం శివదీక్షగా చేపట్టిందని పేర్కొన్నారు. మూసీ నది కేవలం మురుగు కాలువగా మిగిలిపోకూడదని, 365 రోజులు అందులో మంచినీరు ప్రవహించేలా 20 టీఎంసీల గోదావరి జలాలను గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు తరలించి, అక్కడి నుంచి 5 టీఎంసీలను నిరంతరం మూసీలోకి విడుదల చేస్తామని అభయం ఇచ్చారు.
రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరిసేలా మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంచిరేవులలో నిర్మిస్తున్న ఈ ఓంకారేశ్వర ఆలయం ‘దక్షిణ కాశి’గా విరాజిల్లడమే కాకుండా, నది పొడవునా ఇతర మతాల ప్రార్థనా మందిరాలను కూడా ప్రభుత్వం నిర్మించనుందని వెల్లడించారు. పురానాపూల్ వద్ద ఒక భారీ మసీదును, గౌలిగూడలో గురుద్వారాను, నాగోల్ ప్రాంతంలో మెదక్ చర్చి తరహాలో ఒక అద్భుతమైన చర్చిని నిర్మిస్తామని, తద్వారా హైదరాబాద్ గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిని ప్రపంచానికి చాటుతామని వివరించారు. ఈ పనులన్నీ అత్యంత పారదర్శకంగా, పర్యాటక మరియు ఆధ్యాత్మిక విలువలతో కూడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగి అన్ని పదవులను అనుభవించిన ఆమె, ఇప్పుడు తన కుమారుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసులు వేయించి మూసీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం శోచనీయమని విమర్శించారు. “మీకు ప్రజాప్రతినిధిగా కొనసాగే అర్హత ఉందా?” అని ఆమెను నిలదీశారు. అభివృద్ధిని అడ్డుకునే వారు ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టు వల్ల ఆ పరివాహక ప్రాంతం ఒక అద్భుతమైన వ్యాపార, ధ్యాన మరియు పర్యాటక కేంద్రంగా మారుతుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ యజ్ఞాన్ని పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.







