Mahaa Daily Exclusive

  ఐపీఎల్ ‘నోక్’ రచ్చ..! లంక బోర్డుపై పేసర్ నువాన్ తుషార న్యాయపోరాటం…

Share

  • లంక బోర్డుపై పేసర్ నువాన్ తుషార న్యాయపోరాటం.
  •  ఆర్సీబీ తరఫున ఆడేందుకు అనుమతివ్వండి.
  •  కోర్టును ఆశ్రయించిన తుషార.
  •  ఫిట్‌నెస్‌ సాకుతో అడ్డుకుంటున్నారని ఆరోపణ.
  •   ఏప్రిల్ 9న విచారణ.

కొలంబో, మహా.

శ్రీలంక పేసర్ నువాన్ తుషార ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడేందుకు తన సొంత దేశ క్రికెట్ బోర్డు పైనే న్యాయపోరాటానికి దిగాడు. ఐపీఎల్ కోసం అభ్యంతరం లేని పత్రం ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ నిరాకరించడంతో, తుషార కోర్టు మెట్లెక్కాడు. ఈ మేరకు ఎస్‌ఎల్‌సీపై కేసు దాఖలు చేసిన తుషార, తనకు ఐపీఎల్‌లో ఆడే హక్కు ఉందని, బోర్డు కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించాడు. ఈ వివాదానికి సంబంధించి కోర్టు ఏప్రిల్ 9న విచారణ చేపట్టనుంది. ఆర్సీబీ జట్టు తనను ఈ ఏడాది వేలంలో ఎంపిక చేసుకుందని, బోర్డు అనుమతి ఇవ్వకపోతే తన కెరీర్, ఆదాయం దెబ్బతింటాయని తుషార ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో 2024, 2025 సీజన్లలో ఐపీఎల్ ఆడేందుకు ఎస్‌ఎల్‌సీ నుంచి సక్రమంగానే ఎన్ఓసీలు పొందిన తుషారకు, ఈసారి మాత్రం ఫిట్‌నెస్ ప్రమాణాల సాకుతో బోర్డు నిరాకరించింది. అయితే బోర్డు చెబుతున్న కారణాలు అన్యాయమని, గతంలో ఇదే తరహా ఫిట్‌నెస్‌తో ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారని తుషార వాదించాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుతో తనకున్న కాంట్రాక్టు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిందని, దానిని తాను పొడిగించుకోవడానికి సిద్ధంగా లేనని ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగి ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్‌పై దృష్టి సారించాలని భావిస్తున్నానని, ఇప్పటికే తాను జాతీయ సెలక్టర్ల ప్రణాళికల్లో లేనప్పుడు తనను అడ్డుకోవడం సరికాదని తుషార పేర్కొన్నాడు.

ఒకవేళ తనకు సకాలంలో ఎన్ఓసీ రాకపోతే, ఆర్సీబీ ఫ్రాంచైజీ తన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉందని, దీనివల్ల భారీ ఆదాయంతో పాటు తన క్రీడా భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని తుషార ఆందోళన వ్యక్తం చేశాడు. బోర్డు మొండివైఖరి తన వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకంగా మారిందని ఆరోపించాడు. తనకు ఎన్ఓసీ పొందే హక్కు ఉందని ప్రకటించడంతో పాటు, తక్షణమే అనుమతి పత్రం జారీ చేసేలా ఎస్‌ఎల్‌సీని ఆదేశించాలని కోర్టును కోరాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంక క్రికెట్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 9న జరిగే విచారణలో తుషారకు అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో వేచి చూడాలి.

Latest