Mahaa Daily Exclusive

  కల్వకుంట్ల కవిత ‘నయా’ రాజకీయం: టీఆర్‌ఎస్ పేరు ఫ్రీ.. మహిళా సెంటిమెంటే అస్త్రం!

Share

కవిత ‘నయా’ రాజకీయం.
* పాత పేరు… కొత్త ఎజెండా!
*’టీఆర్‌ఎస్‌ పేరు ఫ్రీ.. ఎవరైనా వాడుకోవచ్చు.
* కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.
* బీఆర్‌ఎస్‌ నిద్రావస్థలో ఉంది.. మన పోరాటం కాంగ్రెస్‌పైనే!
* సిద్ధాంతం జయశంకర్‌ సార్‌ది.. మాకు బీహార్‌ వ్యూహకర్తలు లేరు.
* సిద్దిపేటలో మహిళా గళం.. ఆడబిడ్డ సెంటిమెంటే మా అస్త్రం.
హైదరాబాద్, మహా.

తెలంగాణ రాజకీయ యవనికపై మరో పెను సంచలనానికి తెరలేవబోతోంది. గులాబీ గూటిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణల మధ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సరికొత్త రాజకీయ ప్రస్థానానికి అంకురార్పణ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్టిలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దావానలంలా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్‌ఎస్‌) అనే పేరు ఇప్పుడు స్వేచ్ఛగా ఉందని, ఆ పేరును ఎవరైనా వాడుకోవచ్చని ఆమె పేర్కొనడం ద్వారా తన భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. పాత పేరుతోనే, సరికొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వస్తామని చెబుతూనే, గత వైభవాన్ని తిరిగి తెస్తామన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో సెంటిమెంట్‌కు మించిన ఆయుధం లేదని నమ్మే కవిత, రాబోయే రోజుల్లో ‘ఆడబిడ్డ’ కార్డును బలంగా ప్రయోగించబోతున్నారు. ఒక రాష్ట్రంలో ఆడబిడ్డకు ఓటు వేయాలన్న పిలుపు కంటే మించిన ఎమోషన్ ఏముంటుందని ప్రశ్నిస్తూ, మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే సిద్దిపేట స్థానం మహిళలకు రిజర్వు కాదా? అంటూ ఆమె వేసిన ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకపోయినా తమ పార్టీకి ప్రజల్లో బ్రహ్మరథం పడతారని, ముఖ్యంగా మహిళా గళం అసెంబ్లీలో బలంగా వినబడాల్సిన అవసరం ఉందని ఆమె ఆకాంక్షించారు.
మరోవైపు ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పార్టీ తీరుపై ఆమె పరోక్షంగా సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేస్తూ, తన ప్రధాన పోరాటం అధికార కాంగ్రెస్‌ పార్టీపైనే ఉంటుందని స్పష్టం చేశారు. తమ పార్టీ అచ్చమైన తెలంగాణ అస్తిత్వంతో, ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల పునాదులపైనే నడుస్తుందని కవిత తేల్చి చెప్పారు. తమకు బీహార్ నుంచి వచ్చిన రాజకీయ వ్యూహకర్తలు ఎవరూ లేరని, కేవలం మట్టి మనుషుల ఆలోచనలతోనే ముందుకు సాగుతామని పేర్కొనడం ద్వారా ఇతర పార్టీల వ్యూహశైలిపై చురకలు అంటించారు. తెలంగాణ వాదం, మహిళా సాధికారత ఈ రెండు అంశాలే తన నయా ఎజెండాకు దిక్సూచలని ఆమె వివరించారు. ఈ పరిణామాలు చూస్తుంటే త్వరలోనే తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధం మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Latest