Mahaa Daily Exclusive

  మాచర్లలో దారుణం: పరువు కోసం కన్నకూతురిని దిండుతో అదిమి చంపిన కిరాతక తండ్రి!

Share

* పరువు కోసం ప్రాణం తీసిన కన్నతండ్రి.
* మాచర్లలో ‘పరువు’ హత్య కలకలం!
* ప్రేమే పాపమైందా? నిద్రిస్తున్న కూతురిని దిండుతో అదిమి చంపిన కిరాతకుడు!
* ఐదు రోజుల ఒప్పందం.. ఆపై అంతం.
* చౌడేశ్వరి మృతి వెనుక విస్తుపోయే నిజాలు!

హైదరాబాద్, మహా.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో కన్నప్రేమ కనుమరుగైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. పరువు కోసం తన కన్నకూతురిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపుతోంది. గత నెల 18న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 22 ఏళ్ల చౌడేశ్వరి మరణం వెనుక ఉన్న అసలు భయంకర నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. తన మాట వినకుండా ప్రేమించిన వాడితో వెళ్లిపోయి సమాజంలో తన పరువు తీసిందన్న ఆక్రోశంతో, నిద్రిస్తున్న కూతురి ముఖంపై దిండును అదిమి ప్రాణాలు తీసినట్లు కిరాతక తండ్రి చంద్రశ్రీను పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అంతా అయిపోయాక ఏమీ తెలియనట్లుగా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, శాస్త్రీయ ఆధారాలు నిందితుడి అసలు రంగును బయటపెట్టాయి.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రశ్రీను తన కూతురు చౌడేశ్వరికి ఒక ధనవంతుడైన ఉపాధ్యాయుడితో ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు నిశ్చితార్థం కూడా పూర్తి చేశాడు. అయితే, చౌడేశ్వరి తన తండ్రి చూసిన సంబంధాన్ని కాదని, ఇంటి పక్కనే నివసించే నాగరాజు అనే యువకుడిని ప్రేమించింది. తన ప్రేమను గెలిపించుకోవాలని భావించిన ఆమె, నిశ్చితార్థం జరిగిన సంబంధాన్ని కాదని ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో రగిలిపోయిన తండ్రి చంద్రశ్రీను, తన కూతురు ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో చౌడేశ్వరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించగా, కేవలం ఐదు రోజుల ఒప్పందంపై తండ్రి ఆమెను బ్రతిమిలాడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఐదు రోజులే తన కూతురికి నూరేళ్ల ఆయుష్షుగా మారుతాయని ఎవరూ ఊహించలేకపోయారు.
ఇంటికి తీసుకెళ్లిన ఐదు రోజుల వ్యవధిలోనే చంద్రశ్రీను తన ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒకరోజు రాత్రి చౌడేశ్వరి గాఢ నిద్రలో ఉండగా, ఆమెపై దాడి చేసి దిండుతో ముఖాన్ని గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసుల విచారణలో భాగంగా వచ్చిన పోస్టుమార్టం నివేదికలో అది సహజ మరణం కాదని, ఊపిరాడక చనిపోయిందని తేలడంతో అనుమానం బలపడింది. పోలీసులు తమదైన శైలిలో చంద్రశ్రీనును విచారించగా, అసలు విషయం కక్కేశాడు. ఆస్తిపరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే, తన మాట వినకుండా వేరే యువకుడితో వెళ్లిపోయి తన పరువు తీసినందుకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అతడు నిర్వేదంగా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు చంద్రశ్రీనును అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పరువు కోసం ప్రాణం తీసిన ఈ ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Latest