Mahaa Daily Exclusive

  మేడారం పనుల్లో నాణ్యత లోపం: ₹200 కోట్ల కుంభకోణానికి బలైపోయిన పూజారి బిడ్డ!

Share

మేడారం సాక్షిగా ‘మంత్రుల’ పాపం.
* ఆరేళ్ల బాలుడికి శాపమైన అవినీతి దాహం!
* ₹200 కోట్ల మేడారం పనుల కుంభకోణం..
* బలిపశువుగా మారిన పూజారి బిడ్డ!
* ఆడుకుంటే అంగవైకల్యమా? అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం.. చిన్నారికి శాశ్వత వేదన!
హైదరాబాద్, మహా.
సమ్మక్క-సారలమ్మ కొలువున్న మేడారం పవిత్ర గడ్డపై పాలకుల పాపం పసివాడి పాలిట శాపమైంది. భక్తుల కోర్కెలు తీర్చే ఆ తల్లుల చెంత.. మంత్రుల అవినీతి దాహం ఒక చిన్నారి జీవితాన్ని అంధకారం చేసింది. మేడారం జాతర అభివృద్ధి పనుల పేరిట జరిగిన ₹200 కోట్ల కుంభకోణం ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని అంగవైకల్యం వైపు నెట్టింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్కల పర్యవేక్షణలో జరిగిన పనుల్లో నాణ్యత లోపానికి ఆరేళ్ల బాలుడు యువన్ బలిపశువు కావడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిధుల దోపిడీ వెరసి.. గద్దెల వద్ద ఆడుకోవాల్సిన పసివాడు ఇప్పుడు ఆసుపత్రి మంచంపై కాలు కోల్పోయి విలపిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. మేడారం పూజారి సిద్దబోయిన రమేష్ కుమారుడైన యువన్(6), గత నెల 25వ తేదీన మేడారం గద్దెల వద్ద ఆడుకుంటుండగా ప్రమాదం సంభవించింది. అభివృద్ధి పనుల కోసం అక్కడ ఏర్పాటు చేసిన భారీ కాంక్రీట్ దిమ్మెలు అకస్మాత్తుగా బాలుడి కాలుపై పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలును కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించి సర్జరీ చేసినప్పటికీ, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాలును మునపటి స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని తేలిపోయింది. కాలులో ఇన్ఫెక్షన్ సోకి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు ఆ బాలుడి కాలును తొలగించారు. ఆరేళ్ల ప్రాయంలోనే తన కొడుకు ఇలా అంగవైకల్యానికి గురికావడాన్ని చూసి ఆ తండ్రి గుండె పగిలేలా రోదిస్తున్నాడు.
ఈ ఘోరానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర పనుల కోసం కేటాయించిన ₹200 కోట్లు కేవలం మంత్రుల, అధికారుల జేబుల్లోకి వెళ్లాయే తప్ప, క్షేత్రస్థాయిలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదని వారు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని పనులు, అస్తవ్యస్తంగా పడేసిన నిర్మాణ సామాగ్రి వల్లే తమ బిడ్డ కాలు కోల్పోయాడని వారు మండిపడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం జరగాల్సిన పనులు ఇప్పుడు ప్రాణాలు తీసే స్థాయికి చేరడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మంత్రుల అవినీతికి ఒక పూజారి బిడ్డ బలికావడంపై మేడారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest