అవినీతి అనకొండల గుట్టురట్టు!
* హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ పంజా.
* డిజిటల్ లంచాల పర్వం.. ఫోన్ పే లో వసూళ్లు.. వాట్సాప్ లో డీల్స్.. ఏసీబీ విచారణలో షాకింగ్ నిజాలు!
* కిలోల కొద్దీ బంగారం, లక్షల నగదు.. అధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు!
* 42 లక్షల ఆన్‌లైన్ లావాదేవీలు.. డాక్యుమెంట్ రైటర్లతో అధికారుల చీకటి ఒప్పందాలు బట్టబయలు!
* 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు పెండింగ్.. అధికారుల ఇళ్లలో భారీగా నగదు సీజ్!
హనుమకొండ ,మహా.
హనుమకొండ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడి రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టిన ఏసీబీ బృందానికి అధికారుల అక్రమ సంపాదన చూసి కళ్లు బైర్లు కమ్మాయి. కార్యాలయంలో అనధికారికంగా తిష్టవేసిన 20 మంది డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లను గుర్తించిన అధికారులు, వారి వద్ద నుంచి లెక్కల్లో లేని ₹47,450 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయంలో దాచి ఉంచిన 70 అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. లంచం ఇస్తేనే పనులు చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తూ, ఇప్పటికే పూర్తయిన 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను బాధితులకు అందజేయకుండా తొక్కిపెట్టిన వైనం అధికారుల దౌష్ట్యాన్ని చాటుతోంది.
ఈ తనిఖీల్లో అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే.. అవినీతి కూడా ఇప్పుడు డిజిటల్ బాట పట్టింది. అధికారుల వాట్సాప్ చాట్‌లను విశ్లేషించిన ఏసీబీ బృందం, డాక్యుమెంట్ రైటర్లు మరియు అధికారుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలను బట్టబయలు చేసింది. గత ఏడాది కాలంలోనే ఫోన్ పే (PhonePe) ద్వారా ఏకంగా ₹42.03 లక్షల లంచాల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. లంచాల కోసం ఏజెంట్లతో చేతులు కలిపి, సామాన్య ప్రజలను ముప్పతిప్పలు పెడుతూ అక్రమార్జనే ధ్యేయంగా అధికారులు సాగించిన ఈ దందా ఇప్పుడు ఏసీబీ వలలో చిక్కింది. టెక్నాలజీని వాడుకుని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ ఆన్‌లైన్ వసూళ్ల పర్వం చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయారు.
కార్యాలయంలో దొరికిన ఆధారాలతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో నిందితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అధికారుల ఇళ్లలో సుమారు ₹24.61 లక్షల నగదు, 819.5 గ్రాముల బంగారం, 2.6 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ బ్యాంకుల్లో ఉన్న ₹30.1 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను కూడా అధికారులు సీజ్ చేశారు. ఒక్క కార్యాలయంపై జరిగిన దాడితో అధికారుల బినామీ ఆస్తులు, అక్రమ సంపాదన భారీ స్థాయిలో బయటపడటం కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఏసీబీ స్పష్టం చేసింది.








