* స్కూలు ఫీజుల పేరిట నిలువు దోపిడీ.
* సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సిగ్గుచేటు!
* ఫీజు నియంత్రణ చట్టం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరపాలి: కవిత డిమాండ్
* కార్పొరేట్ స్కూళ్లలో ఫుడ్ సేఫ్టీ గాలికి.. టీచర్ల బతుకులు ఆగం.. కవిత ఆవేదన!
* తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలివ్వాలి.. నార్త్ స్కూళ్ల ఆధిపత్యంపై జాగృతి గర్జన!
* ఫీజు దోపిడీని అరికట్టకపోతే స్కూళ్ల ముందు ధర్నాలు చేస్తాం: ప్రభుత్వానికి కవిత హెచ్చరిక!
ఫీజుల పేరిట తల్లిదండ్రుల జేబులకు చిల్లు.. సర్కారు తీరుపై కవిత నిప్పులు!
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పెంపు పేరిట సాగిస్తున్న నిలువు దోపిడీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచి సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులను ఆగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, అవసరమైతే ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయలు ఉన్న ఫీజును అదనంగా మరో 30 వేలు పెంచి భారం మోపడం దారుణమని, తల్లిదండ్రుల జీతాలు పెరగని రీతిలో ఫీజులు పెరగడం ఏంటని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజుల నియంత్రణ లేదని విమర్శించిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని విద్యా రంగ స్వరూపాన్ని వివరిస్తూ.. మొత్తం 39,641 పాఠశాలల్లో దాదాపు 62 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, అందులో 38 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతున్నారని కవిత గుర్తు చేశారు. నారాయణ, చైతన్య వంటి 12 వందల కార్పొరేట్ స్కూళ్లు ఏటా 15 వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయని, కానీ పన్నులు ఎగవేస్తూ, పుస్తకాల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పురుగుల్లా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు కూడా చేయని పుస్తకాలకు రూ. 15 వేలు వసూలు చేయడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు. ఏటా ఫీజు పెంపును 8 శాతానికే పరిమితం చేయాలని, అంతకు మించి పెంచే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా కార్పొరేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు వెళ్తుంటే.. అది ప్రైవేట్ దోపిడీకి వత్తాసు పలికినట్లేనని ఆమె ఎద్దేవా చేశారు.
ఫీజుల దోపిడీతో పాటు కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, ఉపాధ్యాయుల భద్రతను ఆమె ప్రస్తావించారు. నారాయణ, చైతన్య వంటి స్కూళ్లలో వేలాది మందికి ఒకే దగ్గర ఆహారం తయారు చేస్తున్నారని, అక్కడ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేశారని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ జరిగితే వేల మంది విద్యార్థుల ప్రాణాలు ముప్పులో పడతాయని, వెంటనే ఫుడ్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ద్వారా తనిఖీలు చేపట్టాలని కోరారు. అలాగే ప్రైవేట్ టీచర్లకు కనీస పీఎఫ్ సౌకర్యం లేదని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నార్త్ నుంచి వస్తున్న అలెన్, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు తెలంగాణలో వ్యాపారం చేస్తూ ఉద్యోగాలు మాత్రం ఉత్తరాది వారికే ఇస్తున్నాయని, స్థానిక బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించని సంస్థలకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 11 వేల కోట్లు పేరుకుపోయాయని, దీనివల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపేస్తున్నాయని కవిత విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందాల్సిన రూ. 212 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆదాయం తక్కువ ఉన్న బీసీ విద్యార్థులకు కూడా రూ. 42 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండి కూడా విద్యా రంగాన్ని గాలికి వదిలేశారని, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా కనీసం సమీక్ష కూడా చేయడం లేదని మండిపడ్డారు. ఫీజు నియంత్రణ చట్టం రాకపోతే, జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల ముందు భారీ ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ కొనసాగిస్తే.. ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కవిత స్పష్టం చేశారు.








