* బకాయిలు చెల్లించకుంటే ఊళ్లలోకి రానివ్వం!
* ఫీజు బకాయిలపై ఆర్. కృష్ణయ్య గర్జన
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో నెలకొన్న ఫీజు రీయింబర్సుమెంట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఫీజు బకాయిల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావాలనే దుర్మార్గపు ఆలోచనతోనే ప్రభుత్వం నిధులను తొక్కిపెడుతోందని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే, భవిష్యత్తులో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేరని కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాను అందరూ కలిసి దోచుకుంటున్నారని, కానీ పేద విద్యార్థుల చదువుల కోసం ఇచ్చే నిధుల దగ్గరకు వచ్చేసరికి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. ఈ సమస్యపై ఇప్పటికే వందల సార్లు ధర్నాలు, పోరాటాలు చేశామని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు న్యాయం జరగాలనే గొప్ప సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆ ఆశయానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు.
విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఆగిపోయి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి సచివాలయాన్ని ముట్టడిస్తామని, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. పేద విద్యార్థుల పట్ల వివక్ష చూపిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని ఆయన పేర్కొన్నారు.








