సాగరమంతటి అభిమానం.
* సరిహద్దులు దాటిన మద్దతు.
* ‘నిన్న, నేడు, రేపు.. కేసీఆర్ వెంటే’.
సిడ్నీ,మహా.
తెలంగాణ గడ్డపై పుట్టి ఏడు సముద్రాలు దాటినా.. తమ మూలాలు, మట్టి నేత కేసీఆర్ పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ఆస్ట్రేలియాలోని తెలంగాణ బిడ్డలు మరోసారి చాటుకున్నారు. “నిన్న, నేడు, రేపు — కేసీఆర్ వెంటే” అనే నినాదంతో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తెలంగాణ అభ్యున్నతి కోసం పరితపించే ఏకైక నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఎన్ఆర్ఐలు ముక్తకంఠంతో నినదించారు. ఖండాంతరాల్లో ఉన్నా తమ మనసంతా తెలంగాణ ప్రగతి కోసమే పరితపిస్తుందని ఈ వేదిక ద్వారా వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథంలో నడిపించే సత్తా కేవలం కేసీఆర్ గారికి మాత్రమే ఉందని, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే వరకు తాము విశ్రమించబోమని, నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుండి తమ ప్రస్థానం మొదలైందని, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ బాధ్యతని పేర్కొన్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుండి సాధారణ ఎన్నికల వరకు ప్రతిసారీ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించి తమ కట్టుబాటును చాటుకున్నామని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.
తెలంగాణ ప్రజల అభ్యున్నతి, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియా బృందం ఎల్లవేళలా అంకితభావంతో పనిచేస్తుందని ఈ సందర్భంగా ప్రతినిధులు పునరుద్ఘాటించారు. కేసీఆర్ దార్శనికతతోనే బంగారు తెలంగాణ సాధ్యమని వారు ఆకాంక్షించారు. ఈ అపురూప సంఘీభావ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, వినయ్ చెలుపాటి, ఉదయ్ సింహా రెడ్డి, సూర్య రావు, సనిల్ రెడ్డి, సతీష్ పులిపాక, అశోక్ ఈగ, నితీష్ గౌడ్, వెంకట్, భాస్కర్, విశ్వనాధ్, సంజూ రెడ్డి తదితరులతో పాటు వివిధ తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా నినదించడంతో సిడ్నీ పరిసరాలు గులాబీమయంగా మారాయి.








