- బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు
- మహిళా ఐపీఎస్ అధికారిణితో దర్యాప్తు
- సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి
- వివిరణ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, మహా : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారు భగీరథ్ కేసులో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో విచారణ..
ఈ కేసు సున్నితమైనది కావడంతో దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు. బాధితురాలు బాలిక కావడం, ఈ కేసులో ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా విచారణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్ బృందం ఇప్పటికే కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిని ప్రారంభించినట్లు సమాచారం. పోలీసులు బాలిక స్టేట్మెంట్ను చట్టపరమైన నిబంధనల ప్రకారం రికార్డ్ చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు కూడా పరిశీలించే అవకాశముంది. ఈ ఘటనపై హైదరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై కేసు నమోదు చేశారు. బాలిక ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. పోలీసులు పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాలికకు సంబంధించిన కేసు కావడంతో చట్టపరమైన ప్రక్రియలను అత్యంత జాగ్రత్తగా అమలు చేస్తున్నారు.
17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో భగీరథ్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 74, 75, పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసులు నమోదయ్యాయి. గతేడాది బాలికను మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించటంతో పాటు ఆ తర్వాత లైంగింకంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని ఓ అపార్ట్మెంట్లో బలవంతం చేశారని ఈ వేధింపులు భరించలేక తన కూతురు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బండి సంజయ్ కుమారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మిలాకత్ అయి బండి కుమారుడిని రక్షించే ప్రయత్నంలో ఓ బాధితురాలికి అన్యాయం చేస్తోందని ఫైరవుతున్నారు.
కేసు దర్యాప్తు జాప్యంపై సీఎం ఆగ్రహం
ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మే 8వ తేదీన బాధితురాలు ఫిర్యాదు చేస్తే జాప్యం ఎందుకు చేశారంటూ సీఎం రేవంత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదైనా దర్యాప్తు ఎందుకు చేయటం లేదని ఫైరయ్యారు. దీంతో డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. వివరాలు తెలుసుకున్న సీఎం.. కేసు విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పారదర్శకంగా విచారణ జరగాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే అతను కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్లో సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆ అమ్మాయి స్నేహం పేరుతో తనను హనీట్రాప్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వివాహం చేసుకోవాలని లేదంటే రూ.5 కోట్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వారి బెదిరింపులకు భయపడి ఇప్పటికే రూ. 50 వేలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భగీరథ్ ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.








