22 నిమిషాల్లో ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’.
• స్మార్ట్ పవర్’ వ్యూహంతో పాక్‌పై మెరుపు దాడి.
• రక్షణకు చేసే ఖర్చు భారం కాదు.
• ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు.
ఢిల్లీ, మహా.
కేవలం 22 నిమిషాల వ్యవధిలోనే అత్యంత కచ్చితత్వంతో పాక్‌పై మెరుపు దాడులు చేశామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సగర్వంగా వెల్లడించారు. సైనికపరమైన కచ్చితత్వం, సమాచార నియంత్రణ, దౌత్య సంకేతాలు, ఆర్థిక సంకల్పాలను కలగలిపి ‘స్మార్ట్ పవర్’ అనే ప్రశ్నకు భారత్, ప్రపంచానికి పాక్షిక సమాధానాన్ని ఇచ్చిందని ఆయన అభివర్ణించారు. భారతీయ కోణంలో స్మార్ట్ పవర్ అంటే దేశ రక్షణ, అభివృద్ధి, ప్రపంచ దేశాల మధ్య మన ప్రభావాన్ని పెంచుకోవడానికి సైనిక, ఆర్థిక బలాలను తెలివిగా, వ్యూహాత్మకంగా ఉపయోగించడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. మంగళవారం ఢిల్లీలోని రక్షణ రంగ అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్‌లో ‘భద్రత నుంచి శ్రేయస్సుకు: సుస్థిర జాతీయ వృద్ధికి స్మార్ట్ పవర్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆర్మీ చీఫ్ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక సాధారణ సైనిక చర్య కాదని, అది భారతదేశపు సమగ్ర జాతీయ శక్తికి, సత్తాకు నిదర్శనమన్నారు. ఆనాడు పాకిస్థాన్‌ను దారుణంగా దెబ్బతీసిందని, ఆ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఏ స్థాయిలో ధ్వంసం చేసిందో వివరించారు.
దీర్ఘకాలంగా ఉన్న సంప్రదాయ వ్యూహాత్మక భావనను ఆపరేషన్ సిందూర్ ఛేదించిందని జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. సైనిక చర్యను దిగ్విజయంగా పూర్తిచేశాక, అది ఉద్దేశపూర్వకంగా, ఒక పక్కా ప్రణాళికాబద్ధంగానే ఆగిపోయిందని స్పష్టం చేశారు. సుమారు 88 గంటల పాటు సాగిన ఈ సైనిక చర్య అనంతరం ఉద్దేశపూర్వకంగా ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయడం అనేది, సైనిక కదలికను వ్యూహాత్మక చర్యగా ఎప్పుడు మార్చాలో కచ్చితత్వంతో తెలిసిన భారత సేనల చాకచక్యానికి సంపూర్ణ నిదర్శనమని కొనియాడారు. గతేడాది ఈ ఆపరేషన్‌ను అత్యద్భుతంగా అమలు చేసినందుకు గానూ భారత సాయుధ దళాలను ఆయన ఈ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణాలపై సైతం ఆర్మీ చీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంపద, వ్యాపారాలు, వనరులపై పట్టు కోసం కొన్ని దేశాలు సైనిక శక్తితో పవర్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ ఆధిపత్య పోరే పలు ప్రపంచ దేశాల మధ్య అవిశ్వాసాన్ని పెంచుతోందని, అశాంతికి కారణమవుతోందని, కూటముల మధ్య వైరుధ్యాలను క్రియేట్ చేస్తోందని తెలిపారు. నేడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు మరింత సంక్లిష్టమైన సంకేతాలను పంపుతోందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు పెరిగి, దేశాలన్నీ సంపన్నవంతంగా మారితే యుద్ధాలు, గొడవలు రావని గతంలో భావించినప్పటికీ, నేడు ఆ నమ్మకం పూర్తిగా అబద్ధమైందని తేల్చిచెప్పారు. ఇప్పుడు దేశాలు శాంతిగా ఉండాల్సింది పోయి తమ సైనిక, రాజకీయ బలంతో ఎదుటి దేశాల సంపదను, వ్యాపారాలను లాక్కోవడానికి యత్నిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
వాణిజ్యం, సప్లై చైన్‌లు, డిజిటల్ అనుసంధానం వంటివి దేశాలను సంఘర్షణకు తావులేనంతగా పరస్పరం ఆధారపడేలా చేస్తాయనే దృఢమైన సిద్ధాంతంతో 21వ శతాబ్దం ప్రారంభమైందని, కానీ విచిత్రంగా, దేశాలను ఏకం చేస్తాయని భావించిన అవే సాధనాలు ఇప్పుడు బలవంతపు చర్యలకు కీలక సాధనాలుగా మారాయని ఆర్మీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెమీకండక్టర్ల పరిమిత లభ్యత, ప్రపంచ దేశాల రక్షణ వ్యయాలు విపరీతంగా పెరుగుతుండటం, హర్మూజ్ జలసంధి వద్ద నిత్యం ఏర్పడుతున్న అంతరాయాలు అనేవి నేడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యలుగా మారాయన్నారు. సెమీకండక్టర్లు నేడు కేవలం ప్రపంచ దేశాల చేతుల్లో ఒక సాంకేతిక వస్తువుగానే కాకుండా, ఎదుటి దేశాలను బ్లాక్‌మెయిల్ చేయడానికి, తమను తాము కాపాడుకోవడానికి ఉపయోగించే రాజకీయ, సైనిక ఆయుధంగా రూపాంతరం చెందాయని ఆయన విశ్లేషించారు.
ఇక దేశ రక్షణ, దేశ సంపద లేదా అభివృద్ధి మధ్య ఇప్పుడు ఎటువంటి సరిహద్దులు లేవని, ఈ రెండు అంశాలు పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయని ద్వివేది స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్ వ్యయం ఏకంగా 2.7 ట్రిలియన్ డాలర్లను దాటేసిందని, ఈ వ్యయం ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మొత్తం ఖర్చు కంటే చాలా ఎక్కువేనని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు కేవలం సాయుధ దళాలపైనే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి, పరిశోధనా వ్యవస్థలు, ప్రభుత్వాల పాలనా నిర్మాణాలపైనా తీవ్రమైన ఒత్తిడిని, డిమాండ్లను పెంచుతున్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగం కోసం చేసే ఖర్చును ఏమాత్రం దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా భావించకూడదని ఆయన సూచించారు. దేశం ఆర్థికంగా ఎదిగి, సంపదను సృష్టించాలంటే మొదట ఆ దేశానికి రక్షణ, పటిష్టమైన శాంతిభద్రతలు ఉండటమే అత్యంత ప్రాథమిక అవసరమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తన ప్రసంగాన్ని ముగించారు.







