Mahaa Daily Exclusive

  భారత అమ్ములపొదికి అమెరికా భారీ దన్ను…

Share

భారత అమ్ములపొదికి అమెరికా భారీ దన్ను.
* అపాచీ, హోవిట్జర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్.
* రూ.4 వేల కోట్లకు పైగా ఆమోదం తెలిపిన అగ్రరాజ్యం.
* భారత సైనిక సామర్థ్యాన్ని పెంచే దిశగా అమెరికా కీలక అడుగు.

ఢిల్లీ, మహా.

ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాల నడుమ, భారత రక్షణ వ్యవస్థకు అగ్రరాజ్యం అమెరికా నుంచి భారీ మద్దతు లభించింది. భారత త్రివిధ దళాల అమ్ములపొదిలో అత్యంత కీలకమైన అపాచీ హెలికాప్టర్లు, అలాగే శత్రు స్థావరాలను తుత్తునియలు చేసే ఎం777ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగులకు సంబంధించిన నిర్వహణ, మద్దతుపరమైన సర్వీసుల ప్రతిపాదనలకు అమెరికా విదేశాంగ శాఖ లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. తాజా ఒప్పందం ప్రకారం, భారత రక్షణ దళాలకు సుమారు రూ.1,909 కోట్లు (198.2 మిలియన్ డాలర్లు) విలువైన అపాచీ హెలికాప్టర్ల విడిభాగాలు, పరికరాలు, సపోర్ట్ సర్వీసులను అమెరికా అందించనుంది. దీనికి తోడు, అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సైతం శత్రువులపై నిప్పులు చెరిగే ఎం777ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగుల దీర్ఘకాలిక నిర్వహణకు అవసరమైన మద్దతును కూడా అందించేందుకు అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫిరంగుల నిర్వహణ అంచనా వ్యయం దాదాపు రూ.2,217 కోట్లు (230 మిలియన్ డాలర్లు)గా నిర్ధారించారు. ప్రస్తుతం భారత్‌ వద్దనున్న అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ల సర్వీసింగ్ బాధ్యతలను ప్రఖ్యాత బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు తీసుకోనుండగా, హోవిట్జర్ ఫిరంగుల సర్వీసింగ్‌ను యూకేలోని క్యుంబ్రియాకు చెందిన డిఫెన్స్ దిగ్గజం బీఏఈ సిస్టమ్స్ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తాయని అమెరికా విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
దక్షిణాసియాలో భారత్‌ను తమ అత్యంత ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా మరోసారి కీర్తించింది. తమ వద్ద ఉన్న అపాచీ హెలికాప్టర్ల (AH-64E) ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సాంకేతిక డేటా, సిబ్బంది శిక్షణ, ఇతర సహాయక సేవలను అందించాలని భారత్ ఇటీవల కోరింది. అలాగే ఎం777ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగుల దీర్ఘకాలిక నిర్వహణ, అనుబంధ వస్తువులు, విడి భాగాలు, మరమ్మతులు, సాంకేతిక సహాయంలోనూ సహకరించాలని విన్నవించింది. భారత్ చేసిన ఈ ప్రతిపాదనలన్నింటికీ తాము పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ భారీ సహకారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక పురోగతికి దోహదపడే ప్రధాన రక్షణ భాగస్వామిగా భారత్‌ను పరిగణిస్తున్నామని, ఆ దేశ భద్రతను మరింత మెరుగుపర్చేందుకే ఈ సాంకేతిక సాయం చేస్తున్నామని అమెరికా వివరించింది. ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా భారత సైనిక సామర్థ్యం ఇనుమడిస్తుందని, ప్రాంతీయ సవాళ్లకు బలమైన అడ్డుకట్ట పడుతుందని అమెరికా ధీమా వ్యక్తం చేసింది. అదే సమయంలో, భారత్‌కు ఈ భారీ సహాయక సేవలను అందిస్తున్న ఫలితంగా అమెరికా సొంత రక్షణ సంసిద్ధతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని కూడా స్పష్టం చేసింది.
భారత వాయుసేన, ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ బలాన్ని రెట్టింపు చేసిన అపాచీ హెలికాప్టర్ల సంఖ్య, సామర్థ్యంపై రక్షణ వర్గాల్లో ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది. ప్రస్తుతం భారత రక్షణ దళాల వద్ద మొత్తం 28 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 22 హెలికాప్టర్లు వాయుసేన అమ్ములపొదిలో ఉండగా, మిగిలిన 6 హెలికాప్టర్లు ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ ఆధీనంలో ఉన్నాయి. తొలి 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 2015లోనే భారత్ – అమెరికా మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. అవన్నీ 2020 నాటికే డెలివరీ కాగా, వాటన్నింటినీ వాయుసేనకే కేటాయించారు. ఆ తర్వాత 2025 జులైలో 3, 2025 డిసెంబరులో మరో 3 హెలికాప్టర్లను భారత్ అదనంగా కొనుగోలు చేసి ఆర్మీకి అందజేసింది. ధరల విషయానికొస్తే, 2015 ఒప్పందం ప్రకారం భారత వాయుసేనకు ఒక్కో అపాచీ హెలికాప్టర్ సగటున రూ.678 కోట్లకు లభించింది. కానీ దశాబ్దం తిరిగేసరికి అంటే 2025 నాటికి వీటి రేట్లు గణనీయంగా పెరిగాయి. ఆ ఏడాది డెలివరీ చేసిన 6 అపాచీ హెలికాప్టర్ల మొత్తం విలువ దాదాపు రూ.4,168 కోట్లుగా నమోదైంది. అంటే ఒక్కో హెలికాప్టర్ ధర దాదాపు రూ.860 కోట్ల నుంచి రూ.948.5 కోట్ల వరకు పలికింది. కేవలం హెలికాప్టర్లే కాకుండా వాటి విడిభాగాలు, అత్యాధునిక లాంగ్‌బో రాడార్‌లు, విధ్వంసకర హెల్‌ఫైర్ క్షిపణులు, ఆయుధ సామగ్రి, పైలట్ల శిక్షణ కూడా ఈ భారీ ఒప్పందంలో భాగమై ఉండటం విశేషం.
ఇక శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎం777 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగులు కూడా భారత సరిహద్దు భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత సైన్యం వద్ద ప్రస్తుతం మొత్తం 145 ఎం777 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగులు ఉన్నాయి. వీటిలో 25 ఫిరంగులను నేరుగా అమెరికా, బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోగా, మిగితా 120 ఫిరంగులను అత్యంత ప్రతిష్ఠాత్మక ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా భారతీయ దిగ్గజ సంస్థ మహీంద్రా డిఫెన్స్ మన దేశంలోనే అసెంబుల్ చేయడం గమనార్హం. ఈ 145 ఫిరంగులతో భారత సైన్యం ఏకంగా చైనా సరిహద్దుల్లో మొత్తం 7 ఆర్టిలరీ రెజిమెంట్లను పటిష్టంగా ఏర్పాటు చేసింది. బ్రిటన్‌కు చెందిన బీఏఈ సిస్టమ్స్ సంస్థ తయారు చేసే ఒక్కో హోవిట్జర్ ఫిరంగి ధర దాదాపు రూ.35 కోట్లు ఉంటుంది. ప్రత్యేకమైన టైటానియం లోహంతో తయారు కావడం వల్ల ఇవి కేవలం 4,200 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. ఈ తేలికపాటి బరువు కారణంగానే ఈ ఫిరంగులను వైమానిక దళానికి చెందిన భారీ చినూక్ హెలికాప్టర్ల ద్వారా లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి దుర్గమమైన కనుమలు, అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలకు సైతం క్షణాల్లో తరలించడం సాధ్యమవుతుంది. ఇవి 155 మిమీ క్యాలిబర్ బుల్లెట్లను ఉపయోగించి, ఏకంగా 24 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నేలమట్టం చేయగలవు. తాజా సర్వీసింగ్ ఒప్పందంతో ఈ ఆయుధ సంపదకు మరింత పదును పెట్టినట్లయింది.