Mahaa Daily Exclusive

  కోటి సభ్యత్వాలే లక్ష్యంగా గులాబీ డిజిటల్….

Share

కోటి సభ్యత్వాలే లక్ష్యంగా గులాబీ డిజిటల్.
*119 నియోజకవర్గాలకు ఇంచార్జీల ప్రకటన.
* రంగంలోకి 119 మంది ఐటీ నిపుణులు.
* 34,000 బూత్‌లు.. 68 వేల మంది క్రియాశీల కార్యకర్తలకు పకడ్బందీగా సాంకేతిక శిక్షణ.
* సభ్యత్వం పొందిన కార్యకర్తకు రూ. 2 లక్షల బీమా.
* ముగియగానే కమిటీల ఎన్నికలు.

హైదరాబాద్, మహా.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సరికొత్తగా, అత్యంత పటిష్టంగా పునర్నిర్మించేందుకు చారిత్రాత్మక వ్యూహంతో సమరశంఖం పూరించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ ప్రతి ఇంటికీ గులాబీ జెండాను చేర్చడమే ధ్యేయంగా నూతన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అట్టహాసంగా శ్రీకారం చుట్టింది. గతంలో నమోదైన 60 లక్షల సభ్యత్వాల రికార్డును బద్దలుకొడుతూ, ఈసారి ఏకంగా కోటి సభ్యత్వాల మైలురాయిని అందుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ఒక సరికొత్త, అత్యంత సురక్షితమైన డిజిటల్ అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ యాప్ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ మహాక్రతువులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వేదికగా 119 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు, ప్రతి సెగ్మెంట్‌కు ఒకరు చొప్పున ఎంపిక చేసిన 119 మంది ఐటీ నిపుణులకు ఏకకాలంలో అత్యున్నత స్థాయి సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. యాప్ నిర్వహణ, సర్వర్ కనెక్టివిటీ, ఆన్‌లైన్ డేటా వెరిఫికేషన్ వంటి కీలకమైన సాంకేతిక అంశాలపై వీరికి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు.
తెలంగాణ భవన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఐటీ నిపుణులు నేరుగా ఆయా జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాలకు చేరుకుని క్షేత్రస్థాయి పనులకు శ్రీకారం చుడతారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 34,000 పోలింగ్ బూత్‌లు ఉండగా, ప్రతి బూత్‌కు ఇద్దరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,000 మంది క్రియాశీలక కార్యకర్తలను ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం ఎంపిక చేశారు. జిల్లాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ 68,000 మంది కార్యకర్తలకు నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో పకడ్బందీగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. మొబైల్ యాప్ ద్వారా కేవలం కొన్ని క్షణాల్లోనే సభ్యుడి ఫొటో, ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి, డిజిటల్ రశీదును జారీ చేసే విధానంపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. ఈ వారం రోజుల పాటు శిక్షణకు హాజరయ్యే వారికి భోజన వసతులు సైతం కల్పిస్తారు. రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు ఈ వ్యవహారాలన్నింటినీ జిల్లాల వారీగా నిరంతరం మానిటరింగ్ చేస్తారు.
క్షేత్రస్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే, ఈ కార్యక్రమ ప్రారంభ తేదీని అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనుంది. ఆ చారిత్రాత్మక రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ గారితో సహా పార్టీ ముఖ్య నేతలంతా తమ సభ్యత్వాలను పునరుద్ధరించుకుని పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, గతంలో మాదిరిగానే సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల విలువైన ప్రమాద బీమా సదుపాయాన్ని పార్టీ కల్పిస్తోంది. ఇందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీలతో పార్టీ ఇప్పటికే ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇక సభ్యత్వ రుసుముగా సాధారణ సభ్యత్వానికి రూ. 50, క్రియాశీలక సభ్యత్వానికి రూ. 500 నిర్ణయించారు. ఈ భారీ నమోదు ప్రక్రియ ముగియడమే తరువాయిగా, గ్రామ స్థాయి నుంచి మండల, మున్సిపల్, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల పార్టీ కమిటీల నియామకానికి సంబంధించిన అధికారిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. నిర్ణీత తేదీల్లో కమిటీల నియామకం పూర్తయిన తర్వాత వారికి సైతం పార్టీ విధివిధానాలు, రాజకీయ వ్యూహాలపై ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించేలా పక్కా ప్రణాళికలు రచించారు.
**సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీల పూర్తి వివరాలు (ఉమ్మడి జిల్లాల వారీగా):**
**ఆదిలాబాద్ జిల్లా:** సిర్పూర్ నియోజకవర్గానికి పాటిమీది జగన్ మోహన్ రావు, చెన్నూర్ (ఎస్సీ)- తిప్పని లింగన్న, బెల్లంపల్లి (ఎస్సీ)- మిర్యాల రాజిరెడ్డి, మంచిర్యాల- కౌశిక హరి, ఆసిఫాబాద్ (ఎస్టీ)- తొంగల సత్యనారాయణ, ఖానాపూర్ (ఎస్టీ)- సుమిత్ర ఆనంద్ తనోబా, ఆదిలాబాద్‌- రాథోడ్ జనార్దన్, బోథ్ (ఎస్టీ)- ఎ. శ్రీకాంత్ రెడ్డి, నిర్మల్‌- మూల రాజిరెడ్డి, ముధోల్‌ నియోజకవర్గానికి రఘువీర్ సింగ్‌లను ఇన్ఛార్జీలుగా నియమించారు.
**నిజామాబాద్ జిల్లా:** ఆర్మూర్‌కు కాంతారెడ్డి తిరుపతి రెడ్డి, బోధన్‌కు డి. విఠల్ రావు, జుక్కల్ (ఎస్సీ)- మాటం భిక్షపతి, బాన్సువాడ- తోట ఆగయ్య, ఎల్లారెడ్డి- దఫేదార్ రాజు, కామారెడ్డి- మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్‌- రవీందర్ సింగ్, నిజామాబాద్ రూరల్‌- గిర్ధావర్ గంగాధర్, బాల్కొండకు దావా వసంత బాధ్యతలు దక్కించుకున్నారు.
**కరీంనగర్ జిల్లా:** కోరుట్లకు లోక బాపు రెడ్డి, జగిత్యాలకు మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, ధర్మపురి (ఎస్సీ)- మూల విజయ రెడ్డి, రామగుండం- ఎనుగు రవీందర్ రెడ్డి, మంథని- వీర్ల వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి- ఎమ్మెల్సీ పి. వెంకట్రామిరెడ్డి, కరీంనగర్‌- కొండూరి రవీందర్ రావు, చొప్పదండి (ఎస్సీ)- పన్యాల భూపతి రెడ్డి, వేములవాడ- గుడూరి ప్రవీణ్, సిరిసిల్ల- తుల ఉమ, మానకొండూర్ (ఎస్సీ)- పేరాల రవీందర్ రావు, హుజూరాబాద్‌- డాక్టర్ చిరుమిల్ల రాకేష్, హుస్నాబాద్‌కు జివి రామకృష్ణారావు నియమితులయ్యారు.
**మెదక్ జిల్లా:** సిద్దిపేటకు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, మెదక్‌కు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, నారాయణఖేడ్‌- జైపాల్ రెడ్డి, అందోల్ (ఎస్సీ)- పట్నం మాణిక్యం, నర్సాపూర్‌- నరహరి రెడ్డి, జహీరాబాద్ (ఎస్సీ)- దేవీ ప్రసాద్, సంగారెడ్డి- చంద్ర గౌడ్, పటాన్‌చెరు- ఎర్రోళ్ల శ్రీనివాస్, దుబ్బాక- కాసాల బుచ్చిరెడ్డి, గజ్వేల్‌కు రాధాకృష్ణ శర్మ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు.
**రంగారెడ్డి జిల్లా:** మెడ్చల్‌కు రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరికి నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్‌కు ఎమ్మెల్సీ కె. నవీన్ రావు, కూకట్‌పల్లి- గజ్జెల నాగేశ్, ఉప్పల్‌- గొంగిడి మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం- మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, ఎల్బీనగర్‌- నాగేశ్ ముదిరాజ్, మహేశ్వరం- ఎమ్మెల్సీ వాణీదేవి, రాజేంద్రనగర్‌- రావుల శ్రీధర్ రెడ్డి, శేరిలింగంపల్లి- ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, చేవెళ్ల (ఎస్సీ)- రాంబాబు యాదవ్, పరిగి- ఎంఎన్ శ్రీనివాస్, వికారాబాద్ (ఎస్సీ)- గట్టు రాంచందర్ రావు, తాండూరుకు విప్లవ్ కుమార్‌ను నియమించారు.
**హైదరాబాద్ జిల్లా:** ముషీరాబాద్‌కు వెంకట్ రెడ్డి (అంబర్‌పేట్), అంబర్‌పేట్‌- కోలేటి దామోదర్ గుప్తా, ఖైరతాబాద్‌- ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్‌- మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, సనత్‌నగర్‌- గోసుల శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్‌- మాజీ ఎమ్మెల్సీ ఎండీ సలీం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ)- మన్నె క్రిశాంక్, నాంపల్లి- షేక్ అబ్దుల్లా సోహైల్, కార్వాన్‌- ఇనాయత్ అలీ బాఖ్రీ, గోషామహల్‌- గౌండ్ల నాగేందర్ గౌడ్, చార్మినార్‌- అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, చాంద్రాయణగుట్ట- షాహీన్ అఫ్రోజ్, యాకుత్‌పురా- అర్షద్ అలీ ఖాన్, బహదూర్‌పురా- ఎస్.ఎ. ఖైసర్, మలక్‌పేట్‌కు మహమ్మద్ ఆజమ్ అలీ ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు.
**మహబూబ్‌నగర్ జిల్లా:** కొడంగల్‌కు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, నారాయణపేట- రాజీవ్ సాగర్, మహబూబ్‌నగర్‌- వాల్యా నాయక్, జడ్చర్ల- పాల్వాయి శ్రవంతి, దేవరకద్ర- పల్లె రవికుమార్, మక్తల్‌- దూదిమెట్ల బాలరాజు, వనపర్తి- మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, గద్వాల- ఆంజనేయ గౌడ్, అలంపూర్ (ఎస్సీ)- ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, నాగర్‌కర్నూలు- జహంగీర్, అచ్చంపేట (ఎస్సీ)- శుభప్రద్ పటేల్ నూలి, కల్వకుర్తి- రజిని సాయిచంద్, షాద్‌నగర్‌- బైకాని శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్‌కు అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని నియమించారు.
**నల్గొండ జిల్లా:** దేవరకొండ (ఎస్టీ)- చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నాగార్జునసాగర్‌- మాజీ ఎమ్మెల్యే బుడిద భిక్షమయ్య గౌడ్, మిర్యాలగూడ- మాజీ ఎంపీ బి. లింగయ్య యాదవ్, హుజూర్‌నగర్‌- కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడ- తిప్పన విజయసింహా రెడ్డి, సూర్యాపేట- ఈస్లావత్ రాంచందర్ నాయక్, నల్గొండ- ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, మునుగోడు- వెంకట నారాయణ గౌడ్, భువనగిరి- క్యామ మల్లేష్, నకిరేకల్ (ఎస్సీ)- గుజ్జా దీపిక యుగంధర్ రావు, తుంగతుర్తి (ఎస్సీ)- ఏలగందుల వెంకటేశ్వర్, ఆలేరుకు బండా నరేందర్ రెడ్డి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు.
**ఖమ్మం జిల్లా:** పినపాక (ఎస్టీ)కు దిండిగల రాజేందర్, ఇల్లందు (ఎస్టీ)- చాడ కిషన్ రెడ్డి, ఖమ్మం- అనుగుల రాకేష్ రెడ్డి, పాలేరు- ఎమ్మెల్సీ తాతా మధు, మధిర (ఎస్సీ)- మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా (ఎస్టీ)- ఆర్‌జేసీ కృష్ణ, సత్తుపల్లి (ఎస్సీ)- కురాకుల నాగభూషణం, కొత్తగూడెం- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట (ఎస్టీ)- ఉప్పల వెంకటరమణ, భద్రాచలం (ఎస్టీ)కు రావలపల్లి రామ్ ప్రసాద్‌ను నియమించారు.
**వరంగల్ జిల్లా:** జనగామకు బండా శ్రీనివాస్, ఘనపూర్ (ఎస్సీ)- నాగుర్ల వెంకన్న, పాలకుర్తి- ఎం. సుధీర్ కుమార్, డోర్నకల్ (ఎస్టీ)- మాజీ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ (ఎస్టీ)- వై. సతీష్ రెడ్డి, నర్సంపేట- మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పరకాల- సమ్మా రావు, వరంగల్ పశ్చిమ- కె. వాసుదేవ రెడ్డి, వరంగల్ తూర్పు- మర్రి యాదవ రెడ్డి, వర్ధన్నపేట (ఎస్సీ)- మసూద్, భూపాలపల్లి- రామస్వామి నాయక్, ములుగు (ఎస్టీ)కు గండ్ర జ్యోతి ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు.