Mahaa Daily Exclusive

  కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ….

Share

కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ.
* ముక్తీశ్వరుని సన్నిధికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా.
*ఘన స్వాగతం పలికిన మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు.
*త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు.
* సప్తహారతి, కన్నులపండువగా సాంస్కృతిక కార్యక్రమాలు.
కాలేశ్వరం, మహా.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న పవిత్ర ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ మహా క్రతువులో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం కాళేశ్వరం చేరుకున్నారు. దేశంలోనే అత్యంత విశిష్టమైన త్రివేణి సంగమ (గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదుల కలయిక) తీరానికి విచ్చేసిన రాష్ట్ర ప్రథమ పౌరుడికి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన గవర్నర్‌కు అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు, పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు.
కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. ముందుగా పవిత్ర త్రివేణి సంగమ ఘాట్ వద్ద భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తదనంతరం అక్కడి నుంచి నేరుగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ప్రాచీన ఆలయానికి చేరుకుంటారు. గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందనున్నారు. పుష్కరాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పవిత్ర యజ్ఞ యాగాదులను ఆయన స్వయంగా వీక్షించనున్నారు. దేశంలో ప్రయాగ్‌రాజ్ తర్వాత అంతటి విశిష్టత కలిగిన ఈ క్షేత్రంలో గవర్నర్ పర్యటనతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరిసింది.
స్వామివారి దర్శనానంతరం సాయంత్రం వేళ సరస్వతీ ఘాట్ వద్ద దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ‘సప్తహారతి’ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. నదీమతల్లికి సమర్పించే ఈ మహా హారతి కన్నులపండువగా జరిగింది. అనంతరం భక్తులను అలరించేందుకు, పుష్కరాల విశిష్టతను చాటేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు. శుక్రవారం ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆయన కాళేశ్వరం నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్ర ప్రథమ పౌరుడి రాకతో కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.