హైదరాబాద్, మహా
డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా… ప్రభుత్వ పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే చేర్చేలా ఒక ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ది ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నోవాటెల్ హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతోందని, సంప్రదాయ పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కు అనుగుణంగా మార్పుల్ని అందిపుచ్చుకునే దేశాలకే భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు… మనం సాధిస్తున్న పరివర్తనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో భారత్ సాధిస్తున్న ప్రగతికి తెలంగాణ ఒక గ్రోత్ ఇంజన్ లా మారిందన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్.. ఈ మూడింటినీ నడిపించే ఒక బలమైన ఎకోసిస్టంను ఇప్పటి నుంచే అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఅండ్ఏజీ ఆనంద్ మోహన్ బజాజ్, సెర్ట్ – ఇన్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ సోలంకి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ రాజగోపాల్ శర్మ, సెబీ సీజీఎం సాహిల్ మాలిక్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్థన్, ఆర్బీఐ సీజీఎం శైలజా రాణి జంపాల, ఎన్ ఎస్ ఈ సీఐఎస్వో రాజేష్ థాపర్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో వినాయక్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు.








