Mahaa Daily Exclusive

  సచివాలయం వద్ద ఉద్రిక్తత……

Share

సచివాలయం వద్ద ఉద్రిక్తత.
• కల్లాల్లో మగ్గుతున్న వరి ధాన్యం.
• ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత కన్నెర్ర.
• ధాన్యం రోడ్డుపై పోసి వినూత్న నిరసన.
• కవిత అరెస్ట్ ..ఫలక్‌నుమా పీఎస్‌కు తరలింపు.
* రైతుల పక్షాన కదనరంగంలోకి కవిత,
హైదరాబాద్, మహా.
కల్లాల్లో పోగుపడిన వరి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరుబాట పట్టారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతన్నల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కవిత నేరుగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. శుక్రవారం నాడు సచివాలయం ఎదుట వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ఆమె వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తపరిచారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చిన్నచూపు చూస్తోందని, వారిని అరిగోసలు పెడుతోందని కవిత ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉన్నతాధికారులకు స్పష్టంగా తెలియాలనే ఉద్దేశంతోనే అత్యంత కీలకమైన సచివాలయం ఎదుట ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు కవిత స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై కనీసం ఒక్కసారి కూడా సమగ్రమైన సమీక్ష నిర్వహించకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందని ఆమె విమర్శించారు. పరిపాలనలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ విధానాలు అన్నదాతలకు శాపంగా మారుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని వ్యవసాయ కల్లాల్లో వానలకు తడుస్తూ, ఎండలకు ఎండుతూ వేలాది టన్నుల ధాన్యం పేరుకుపోయిందని, వెంటనే ఆ ధాన్యంతో పాటు జొన్నలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా తక్షణమే యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం వద్ద భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకుండా సచివాలయం వద్ద ధర్నా చేపట్టిన కవితతో పాటు, ఆమెకు మద్దతుగా నిలిచిన పార్టీ కార్యకర్తలను, నేతలను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. అనంతరం వారందరినీ అరెస్టు చేసి ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ పోరాటం ఆగదని కవిత మరియు ఆమె అనుచరులు స్పష్టం చేస్తున్నారు.