Mahaa Daily Exclusive

  ప్రధాని మోదీకి ‘ఝాల్‌మురి’ అమ్మిన వ్యాపారికి బాంబు బెదిరింపులు.

Share

ప్రధాని మోదీకి ‘ఝాల్‌మురి’ అమ్మిన వ్యాపారికి బాంబు బెదిరింపులు.
* పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర కలకలం.
* బాంబుతో పేల్చేస్తాం’.. వాట్సాప్‌లో ప్రాణహాని హెచ్చరికలు.
* ఝార్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ కుమార్ షా ఫిర్యాదు.

ఝార్‌గ్రామ్ (పశ్చిమ బెంగాల్),మహా.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా తన చేతులతో బెంగాలీ ప్రత్యేక వంటకం ‘ఝాల్‌మురి’ విక్రయించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక సాధారణ వీధి వ్యాపారి ఇప్పుడు అంతర్జాతీయ బాంబు బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌ పరిధిలో గల కాలేజ్ మోర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఝాల్‌మురి విక్రయించే విక్రమ్ కుమార్ షా అనే చిన్న వ్యాపారికి గుర్తు తెలియని వ్యక్తుల నుండి వాట్సాప్ సందేశాలు, ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ ద్వారా వరుసగా ప్రాణహాని హెచ్చరికలు వస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ తిన్న దుకాణం కావడం, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తికే ఇలాంటి ముప్పు పొంచి ఉండడంతో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
**పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు:**
ఈ భయానక ఘటనపై బాధితుడు విక్రమ్ కుమార్ షా తక్షణమే ఝార్‌గ్రామ్‌ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. శని, ఆదివారాల్లో ఒక గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ నుండి తన వ్యక్తిగత వాట్సాప్‌ నంబరుకు అత్యంత భయంకరమైన బెదిరింపు సందేశం వచ్చిందని విక్రమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. “ప్రస్తుతం నువ్వు మా ప్రధాన టార్గెట్‌.. నిన్ను, నీ దుకాణాన్ని బాంబుతో పేల్చేస్తాం” అని ఆ సందేశంలో స్పష్టంగా రాసి ఉన్నట్లు వివరించాడు. అంతేకాకుండా, ఆ మెసేజ్ వచ్చిన కొద్దిసేపటికే ఒక విదేశీ కోడ్‌తో కూడిన నంబర్ నుండి నేరుగా ఫోన్ కాల్ కూడా వచ్చిందని తెలిపాడు. తాను ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి మొదట ‘అస్సలామువాలైకుం’ అని పలికాడని, ఆ గొంతు విని తాను నిశ్చేష్టుడై ఏమీ స్పందించకపోవడంతో, త్వరలోనే నిన్ను బాంబుతో ముక్కలు ముక్కలు చేస్తామంటూ అవతలి వ్యక్తి అరచి ఫోన్ పెట్టేశాడని విక్రమ్ వెల్లడించాడు. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన విధానం, అందులోని భాషను బట్టి అవి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌ లేదా పాకిస్థాన్‌ల నుండి వచ్చి ఉండొచ్చని ఆయన తన ఫిర్యాదులో గట్టి అనుమానం వ్యక్తం చేశాడు.
**సైబర్ కోణంలో పోలీసుల ముమ్మర దర్యాప్తు:**
చిన్న వ్యాపారికి వచ్చిన ఈ అంతర్జాతీయ బాంబు బెదిరింపుల ఉదంతంపై ఝార్‌గ్రామ్ ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) మానవ్ సింగ్లా తక్షణమే స్పందించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ, సైబర్ చట్టాల కింద కేసు నమోదు చేసి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ కోణంలో ఈ విచారణను ముమ్మరం చేసింది. విక్రమ్ మొబైల్‌కు వచ్చిన వాట్సాప్ ఐపీ (IP) అడ్రస్‌లను, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ బెదిరింపులు నిజంగానే విదేశీ ఉగ్రవాద నంబర్ల నుండి వచ్చాయా? లేక స్థానికంగా ఎవరైనా కావాలనే రాజకీయ కక్షతో లేదా అసూయతో ఇంటర్నెట్ కాల్స్ ద్వారా విక్రమ్‌ను భయపెట్టేందుకు ఈ నాటకానికి తెరలేపారా? అనే కోణంలో పోలీసులు కూలంకషంగా విచారణ జరుపుతున్నారు. ప్రధాని మోదీ పర్యటించి వెళ్లిన ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాలేజ్ మోర్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
**ఇంతకీ ప్రధాని మోదీతో ఉన్న ఆ వైరల్ నేపథ్యం ఏంటి?:**
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల భారీ ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఝార్‌గ్రామ్‌ పర్యటనకు వచ్చారు. ఆ రోజు సాయంత్రం వేళ ఎన్నికల ప్రచారం ముగించుకుని ప్రధాని మోదీ హెలిప్యాడ్‌కు తిరుగు ప్రయాణమైన దారిలో, అకస్మాత్తుగా విక్రమ్ నడుపుతున్న ‘చబల్ లాల్ స్పెషల్ ఝాల్‌మురి’ అనే చిన్న బండి (దుకాణం) వద్ద తన కాన్వాయ్‌ను ఆపించారు. నేరుగా విక్రమ్ వద్దకు వెళ్లిన ప్రధాని, కేవలం రూ.10 ఇచ్చి ఒక ప్యాకెట్ ఝాల్‌మురి కొనుగోలు చేసి ఆరగిస్తూ ముచ్చటించారు. ఆ సమయంలో విక్రమ్ ఎంతో అమాయకంగా ‘సార్.. మీరు ఉల్లిపాయలు తింటారా?’ అని ప్రధానిని అడగగా.. దానికి మోదీ నవ్వుతూ ‘హా.. ఉల్లిపాయలు తింటాను భయ్యా.. కానీ ఎవరి బుర్ర మాత్రం తినను’ అని సరదాగా అనడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఆ తర్వాత అక్కడే ఉన్న స్థానిక మహిళలు, చిన్న పిల్లలతో మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ఈ మధుర క్షణాలను ‘ఝార్‌గ్రామ్‌లో ఝాల్‌మురి బ్రేక్’ శీర్షికతో ప్రధానమంత్రి మోదీ స్వయంగా తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయడంతో, ఆ వీడియోలు, ఫొటోలు రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షించి వైరల్ అయ్యాయి. దీనితో తొమ్మిదో తరగతి వరకు చదువుకుని, బిహార్‌లోని గయా జిల్లా మనమాధో గ్రామం నుండి పొట్టకూటి కోసం బెంగాల్ వచ్చి, తండ్రితో కలిసి గత 10 ఏళ్లుగా ఈ వ్యాపారం చేసుకుంటున్న విక్రమ్ కుమార్ షా ఒక్కసారిగా దేశవ్యాప్త సెలబ్రిటీగా మారిపోయాడు.
**ఎన్నికల తర్వాత పొంచి ఉన్న ముప్పు:**
అయితే ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే, తీవ్ర భయాందోళనల కారణంగా విక్రమ్ కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, ఆ సమయంలో అతని వృద్ధ తల్లిదండ్రులే దుకాణాన్ని నడిపించారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు పూర్తిగా ముగిసిన తర్వాత ధైర్యం తెచ్చుకుని విక్రమ్ మళ్లీ తన ఝాల్‌మురి బండి వద్ద కూర్చోవడం ప్రారంభించాడు. సరిగ్గా వ్యాపారం పుంజుకుంటున్న తరుణంలోనే, ఇప్పుడు నేరుగా అంతర్జాతీయ నంబర్ల నుండి ‘బాంబులతో లేపేస్తాం’ అంటూ ప్రాణహాని హెచ్చరికలు రావడం పశ్చిమ బెంగాల్ అంతర్గత భద్రతపై మరియు రాజకీయ వర్గాలలో సరికొత్త చర్చకు, ఉత్కంఠకు దారితీస్తోంది.