- బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో భారీగా పేరుకుపోతున్న సొమ్ము
- పాత రికార్డుల్లో అక్షర దోషాలు, కేవైసీ సమస్యలే ప్రధాన ఆటంకం
- ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో రాని ఫలితాలుఢిల్లీ, మహా.
దేశంలో ఎవరూ పట్టించుకోకుండా, క్లెయిమ్ చేయకుండా మిగిలిపోతున్న ఆర్థిక ఆస్తుల విలువ రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ అన్‌క్లెయిమ్డ్ (క్లెయిమ్ చేయని) ఆస్తుల విలువ ఏకంగా రూ.1.1 లక్షల కోట్లకు చేరుకుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పలు బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో యజమానులు ఎవరో తెలియక, వారసుల జాడలేక ఈ నిధులు అంతకంతకూ పేరుకుపోతూనే ఉన్నాయి. క్లెయిమ్ చేసుకోని నిధుల గురించి ప్రజలను మేల్కొలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మీ డబ్బు-మీ హక్కు’ తదితర అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నప్పటికీ క్లెయిమ్ చేసుకునే వారి సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.వివిధ రూపాల్లో పేరుకుపోయిన నిధులుదేశవ్యాప్తంగా అన్‌క్లెయిమ్డ్ ఖాతాల్లో మూలుగుతున్న మొత్తం రూ.1.1 లక్షల కోట్లలో అత్యధిక భాగం బ్యాంకుల్లోనే ఉండటం గమనార్హం. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో సుమారు రూ.83 వేల కోట్లు యజమానుల కోసం ఎదురుచూస్తున్నాయి. వీటితో పాటు ఈక్విటీ పెట్టుబడుల రూపంలో రూ.10,000 కోట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో మరో రూ.14,000 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ డిపాజిట్లన్నీ వివిధ నియంత్రణ సంస్థల భద్రతలో కొనసాగుతున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తన పరిధిలోని నిధులను ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’కు మళ్లించగా, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తన పరిధిలోని ఈక్విటీ నిధులను ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’ (ఐపీఈఎఫ్)లో భద్రపరిచింది.
అసలు సమస్య పాత రికార్డులతోనే..
ఈ భారీ నిధులు ఇలా పేరుకుపోవడానికి ప్రధాన కారణం ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) ప్రక్రియను డిజిటల్‌గా కాకుండా దస్త్రాల (పత్రాల) రూపంలో నిర్వహించిన పాత ఖాతాలేనని స్పష్టమవుతోంది. పాన్‌కార్డు, ఆధార్‌కార్డుల అనుసంధానం వంటివి రాకముందు ఖాతాదారుల వివరాలను బ్యాంకుల్లో చేతిరాతతో నమోదు చేసేవారు. ఆ సమయంలో తలెత్తిన అక్షర దోషాలు, ఖాతాదారులు ఇచ్చిన తాత్కాలిక చిరునామాలు ఇప్పుడు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆయా నిధులను విత్‌డ్రా చేసుకునేందుకు లబ్ధిదారులు డిజిటల్ కేవైసీని అనుసంధానించాలని చూస్తున్నప్పుడు, పాత రికార్డులకు, ప్రస్తుత ఆధారాలకు పొంతన కుదరక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పాత ఖాతాల్లో చాలావరకు నామినీ వివరాలు నమోదు చేయకపోవడం వల్ల, ఖాతాదారుడు మరణించాక అసలైన వారసులు కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
పత్రాల సమర్పణ.. వారసులకు పెనుభారం
ఈ వ్యవహారం కేవలం నిలిచిపోయిన ఖాతాల సమస్యగానే కాకుండా, అర్హత నిరూపణకు సంబంధించిన అతిపెద్ద సవాలుగా మారిందని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చట్టబద్ధమైన వారసులకు ఆ నిధులపై హక్కు ఉన్నప్పటికీ, తమ గుర్తింపును, అర్హతను నిరూపించుకునే క్రమంలో రకరకాల అఫిడవిట్లు, ఇండెమ్నిటీ పత్రాలు సమర్పించడం వారికి పెను భారంగా పరిణమిస్తోంది. ఒకవేళ అసలైన ఖాతాదారులు బతికి ఉన్నప్పటికీ.. వయసు పైబడటం వల్ల వారి సంతకాలు మారడం, బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు సరిగా పడకపోవడం సమస్యను జటిలం చేస్తున్నాయి. మతిమరుపు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వృద్ధుల విషయంలో ఈ ప్రక్రియ మరింత కష్టంగా మారుతోంది. ఇక వాస్తవ ఖాతాదారులు మరణిస్తే, వారు చేసిన పెట్టుబడుల వివరాలు వారసులకు తెలియకపోవడం, వివరాల్లో పొరపాట్ల వల్ల కేవైసీకి సరిపోకపోవడంతో కోట్లాది రూపాయలు ఉండిపోతున్నాయని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నా దక్కని ఆశించిన ఫలితం
క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన డిపాజిట్లను అసలైన లబ్ధిదారులకు చేర్చేందుకు ప్రభుత్వం నిబంధనలను కొంత సరళతరం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆస్తులను వెతుక్కునేందుకు ‘ఉద్గమ్’ పేరిట ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే గతేడాది ఆర్‌బీఐ, సెబీ సంస్థలు సంయుక్తంగా ‘మీ డబ్బు-మీ హక్కు’ అనే పేరుతో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా సుమారు రూ.5,777 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి వాటిని లబ్ధిదారులకు తిరిగి అప్పగించగలిగారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మిగిలి ఉన్న భారీ నిధులను వెలికితీసి వాస్తవ వారసులకు చేర్చడం ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాంగానికి ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది.







