Mahaa Daily Exclusive

  గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎబోలా అలర్ట్. ప్రయాణికులకు ముమ్మర తనిఖీలు….

Share

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎబోలా అలర్ట్. ప్రయాణికులకు ముమ్మర తనిఖీలు.
*కాంగో, ఉగాండా నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి.
*సింగపూర్ ఫ్లైట్‌లో వచ్చిన 185 మందికి థర్మల్ స్క్రీనింగ్.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ముందస్తు నివారణ చర్యలు.
గన్నవరం, మహా.
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎబోలా కేసులు, మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతుండటంతో ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా అలర్ట్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన స్పష్టమైన ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముమ్మరంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా కాంగో, ఉగాండా సహా ఇతర ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్నందున ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ విమానాల ద్వారా వస్తున్న ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీని (ప్రయాణ నేపథ్యం) క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తిస్తే, వారికి వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో నిశితంగా వైద్య పరీక్షలు జరుపుతున్నారు. ఎబోలా దేశంలోకి ప్రవేశించకుండా తొలి దశలోనే అడ్డుకునేందుకు ఈ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా సింగపూర్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికులకు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. మొత్తం 185 మంది ప్రయాణికులు ఈ ఫ్లైట్‌లో రాగా, వారందరికీ విమానాశ్రయంలోని ప్రత్యేక కౌంటర్ల వద్ద వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వైరస్ వ్యాప్తికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో పటిష్టమైన ఆరోగ్య ప్రమాణాలు పాటిస్తున్నట్లు, సిబ్బందికి సైతం తగిన జాగ్రత్తలు సూచించినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని బట్టి రాబోయే రోజుల్లో ఈ తనిఖీలను మరింత కఠినతరం చేయనున్నట్లు స్పష్టం చేశారు.