ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.
* రేవంత్ రెడ్డి సన్నిహితుడికి ‘సిట్’ నోటీసులు.
* నేడు అధికారుల ముందుకు కొడంగల్ కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డి.
*ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టేందుకే ట్యాపింగ్?.
* బాధితుడి స్థానంలో విచారించి వాంగ్మూలం నమోదు చేయనున్న దర్యాప్తు బృందం.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్ద కాలంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డికి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. సిట్ ఆదేశాల మేరకు ఆయన సోమవారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ అధికారుల అక్రమ నిఘాకు సంబంధించిన కీలక సాంకేతిక ఆధారాలను సేకరించడమే లక్ష్యంగా సిట్ ఈ విచారణను చేపట్టబోతోంది.
విచారణకు హాజరుకానున్న శ్రీరాం రెడ్డి.. ప్రస్తుతం దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, కొడంగల్ నియోజకవర్గంలో కీలక నేతగా పేరుపొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం.. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కార్యకలాపాలు, కదలికలపై నిఘా పెట్టేందుకు ఆయనతో నిరంతరం సంభాషించే శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించుకుంది. రేవంత్ రెడ్డి పంపే రాజకీయ వ్యూహాలు, పార్టీ అంతర్గత పరిణామాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా ఈ అక్రమ ట్యాపింగ్ సాగిందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బాధితుడి స్థానంలో శ్రీరాం రెడ్డిని విచారించి, ఈ అక్రమ నిఘాకు సంబంధించిన మరిన్ని లోతైన వివరాలను రాబట్టేందుకు సిట్ సిద్ధమైంది. గతంలో ఆయన ఫోన్‌ను ఏయే కాలాల్లో ట్యాప్ చేశారు? ఎవరెవరితో జరిపిన సంభాషణలను రికార్డ్ చేశారు? అనే సాంకేతిక అంశాలపై అధికారులు ఆయనను నిశితంగా ప్రశ్నించనున్నారు. విచారణలో భాగంగా శ్రీరాం రెడ్డి నుంచి అధికారిక వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, ట్యాపింగ్‌కు గురైనట్లు భావిస్తున్న ఆయన పాత మొబైల్ ఫోన్లు, కాల్ డేటా రికార్డులను (సిడిఆర్) కూడా సిట్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఈ విచారణ ద్వారా మరికొంతమంది కీలక సూత్రధారుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో, తాజా పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.








