**శంషాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల భూ కుంభకోణం!
**ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే 170 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా.
**నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరం ఎలా అయ్యింది?.
**తక్షణమే సిట్ లేదా సీఐడీతో విచారణ జరిపించాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్.
**రైతుల పక్షాన మాట్లాడిన జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికం.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రైతుల దయనీయ స్థితిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వ భూములను మాత్రం యథేచ్ఛగా కొల్లగొడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శంషాబాద్ మండలంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిన భారీ కుంభకోణాన్ని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీలు నెరవేర్చడం, ధాన్యం కొనుగోలు చేయడం చేతకాని పాలకులు భూ కబ్జాలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రభుత్వ పెద్ద హస్తం ఉందని, వెంటనే సిట్ లేదా సీఐడీతో విచారణ జరిపించి ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
**నాలుగు రోజుల్లోనే మారిపోయిన రికార్డులు**
శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్న సుమారు 170 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమార్కులు భారీ స్కెచ్ వేశారని హరీశ్‌రావు ఆరోపించారు. వాస్తవానికి ఆ భూమి ప్రభుత్వానిదేనని, అది ఆక్రమణకు గురి కాకుండా వెంటనే నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టాలని ఆర్డీవో గతంలోనే తహశీల్దార్‌ను ఆదేశించారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని 2026 జనవరి 30న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సైతం స్పష్టంగా పొందుపరిచారని తెలిపారు. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 24న సదరు తహశీల్దార్ కూడా అది ప్రభుత్వ భూమిగా తేల్చారని, కానీ ఆశ్చర్యకరంగా సరిగ్గా నాలుగు రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 28వ తేదీన అదే తహశీల్దార్ ఆ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందంటూ ఆర్డర్ పాస్ చేశారని విమర్శించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ భూమి ప్రైవేటు ప్రాపర్టీగా ఎలా మారుతుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
**అధికారుల తీరుపై అనుమానాలు.. ఏసీబీ వెనక్కి ఎందుకొచ్చింది?**
ఈ అక్రమ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై హరీశ్‌రావు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్డీవో, తహశీల్దార్ వేర్వేరు రిపోర్టులు ఇచ్చినప్పుడు జీపీ రెవెన్యూ హైకోర్టుకు ఆ నివేదికను ఎలా సమర్పించారని నిలదీశారు. ఏ ఆర్డర్ అయినా జిల్లా కలెక్టర్ అప్రూవల్‌తోనే హైకోర్టుకు వెళ్తుందని, అలాంటప్పుడు కలెక్టర్, అడ్వకేట్ జనరల్ (ఏజీ) దీన్ని ఎలా అప్రూవ్ చేశారో సమాధానం చెప్పాలన్నారు. చట్ట ప్రకారం ఒక భూమిని ‘భూ భారతి’ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలంటే దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఆర్డీవో అప్రూవ్ చేయాల్సి ఉంటుందని, కానీ ఈ కేసులో ఎమ్మార్వో చెప్పగానే అక్రమంగా ఎంట్రీ అయిపోయిందని మండిపడ్డారు. ఇంత పెద్ద కుంభకోణం పత్రికల్లో వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు దాడులకు వెళ్లారని, కానీ ముఖ్యమంత్రి సన్నిహితుడైన ఓ పెద్దాయన ఒత్తిడి వల్లే వారు ఖాళీ చేతులతో వెనక్కి వచ్చేశారని ఆరోపించారు. చర్యల పేరుతో ఎమ్మార్వోను కేవలం కలెక్టరేట్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని, భూమిని మాత్రం మ్యుటేషన్ చేసుకున్నారని ధ్వజమెత్తారు.
**ప్రజాపాలన అయితే నిరూపించుకోండి**
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీది నిజంగానే ‘ప్రజాపాలన’ అయితే తక్షణమే తహశీల్దార్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసి, అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆర్డర్‌పై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లాలని, ఆ 170 ఎకరాలను తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాలని కోరారు. ఆర్డీవో ఆర్డర్‌ను దిక్కరించి, వెయ్యి కోట్ల విలువైన భూమిని రాత్రికి రాత్రే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ స్కామ్‌పై తక్షణం సిట్ లేదా సీఐడీతో విచారణ జరిపించాలన్నారు. ఈ కుంభకోణం వెనుక కలెక్టర్, సీసీఎల్ఏ ఉన్నతాధికారులతో పాటు ఏయే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ఆరా తీసి, వారి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
**ఆర్టీసీ డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు దారుణం**
రైతుల పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఒక మాట మాట్లాడిన జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరడం ఏ రకంగా నేరం అవుతుందని ప్రశ్నించారు. ఆరో గ్యారెంటీగా ‘ప్రశ్నించే హక్కు’ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, తీరా అధికారంలోకి వచ్చాక ఇంత నియంతృత్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై విధించిన సస్పెన్షన్‌ను బేషరతుగా ఎత్తివేయాలని, లేనిపక్షంలో అతనికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా నిలబడి ప్రత్యక్ష పోరాటానికి, న్యాయ పోరాటానికి సిద్ధమవుతుందని హరీశ్‌రావు ప్రభుత్వానికి కచ్చితమైన హెచ్చరిక జారీ చేశారు.








