Mahaa Daily Exclusive

  టాలీవుడ్ భవితవ్యంపై రాజమండ్రిలో కీలక ఘట్టం…..

Share

**టాలీవుడ్ భవితవ్యంపై రాజమండ్రిలో కీలక ఘట్టం.. పవన్ కళ్యాణ్‌తో అగ్ర నిర్మాతల అత్యవసర భేటీ!**
**సింగిల్ స్క్రీన్ థియేటర్ల వివాదానికి తెర పడేనా? డిప్యూటీ సీఎం చొరవపైనే సర్వత్రా ఉత్కంఠ!**
రాజమండ్రి,మహా.
తెలుగు చిత్ర పరిశ్రమను గత కొంతకాలంగా తీవ్రంగా కుదిపేస్తున్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్బార్‌కు చేరింది. థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్లు), గిల్డ్ నిర్మాతలకు మధ్య రగులుతున్న అంతర్గత పోరు టాలీవుడ్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో, ఈ వ్యవహారం రాజీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు మంగళవారం అత్యవసరంగా కలవడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. స్థానిక షెల్టన్ హోటల్ వేదికగా జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
**ఉగ్రరూపంలో ఎగ్జిబిటర్లు.. ‘పెద్ది’ సినిమాపై ఎఫెక్ట్!**
సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆదాయ పంపకాలకు సంబంధించి ఖచ్చితంగా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. అయితే నిర్మాతలు ఈ సమస్యను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో థియేటర్ల యజమానులు ఇటీవల తమ అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాను పర్సంటేజ్ విధానం అమలు చేస్తేనే ప్రదర్శిస్తామని తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఏకంగా అల్టిమేటం జారీ చేయడం పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. కేవలం 48 గంటల్లో తమ సమస్యకు పరిష్కారం చూపకపోతే ఇక ప్రదర్శనలు నిలిపివేస్తామన్న థియేటర్ల యజమానుల హెచ్చరికలతో అగ్ర నిర్మాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
**రంగంలోకి మెగాస్టార్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ!**
ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉన్న ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎగ్జిబిటర్లు, గిల్డ్ నిర్మాతలతో కీలక సమావేశం నిర్వహించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చిరంజీవి చొరవ తీసుకున్నారు. అయినా కూడా వివాదం కొలిక్కి రాకపోవడంతో, ప్రభుత్వ స్థాయిలో జోక్యం అవసరమని భావించిన నిర్మాతలు నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించారు. పవన్‌ను కలిసిన వారిలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సూర్యదేవర నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులతో పాటు పలువురు అగ్ర నిర్మాతలు ఉన్నారు.
**సామరస్య పరిష్కారం దిశగా అడుగులు..**
ప్రభుత్వ పరంగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా తగిన చొరవ చూపాలని టాలీవుడ్ పెద్దలు పవన్ కళ్యాణ్‌ను ఈ భేటీలో ముక్తకంఠంతో కోరినట్లు సమాచారం. పరిశ్రమలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ఎగ్జిబిషన్ వ్యవస్థను కాపాడుకునే దిశగా పవన్ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఒక బలీయమైన శక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ జోక్యంతో, ఈ పర్సంటేజ్ గొడవకు త్వరలోనే ఒక స్పష్టమైన, శాశ్వత ముగింపు దొరుకుతుందని టాలీవుడ్ వర్గాలు గంపెడాశతో ఎదురుచూస్తున్నాయి.