కారేపల్లి మండల పాలిటిక్స్ లోకి యువనేత
*రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ఎన్ఆర్ఐ ఎంట్రీ
*యూత్ లో క్రేజ్ లీడర్ గా గుడిపూడి తిరుమలరావు
కారేపల్లి, మహా:దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో వస్తున్న పెను మార్పుల్లో యువత కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆ ప్రభావం పల్లెల్లో ఉండే యూత్ ను కూడా ప్రభావితం చేస్తుంది. గతంలో రాజకీయాలు మనకెందుకని దూరంగా ఉన్న యువత నేడు మనమే రాజకీయాలు చేయాలి మనమే రాజ్యమేలాలి… ప్రజా సేవచేయాలనే సంకల్పంతో ముందుకొస్తున్నారు. ఈ ఆశయంతోనే కారేపల్లి మండలం గేటుకారేపల్లికి చెందిన ఎన్ఆర్ఐ గుడిపూడి తిరుమలరావు కారేపల్లి మండల పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివి లండన్ లో 15 ఏళ్లపాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి వచ్చిన డబ్బంతా భూముల మీద పెట్టి స్వశక్తి తోనే కోటీశ్వరుడయ్యాడు. స్వదేశానికి తిరిగి వచ్చి స్వగ్రామమైన గేట్ కారేపల్లి లో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకొని ఏడాదికితమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తానని ఇటీవల ప్రకటించారు.
*యువతకు క్రికెట్ పోటీలు…
గుడిపూడి వెంకట్రావమ్మ జ్ఞాపకార్ధం రెండు మండలాల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించి యువతను ఉత్తేజపరుస్తూ తిరుమలరావు చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది… దీంతోపాటు మహిళలకు 1000 చీరలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఆదర్శనీయమైనది. క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేతుల మీదుగా చేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో యువనేత సక్సెస్ అయ్యారు.
*సామాజిక నేపథ్యం కూడా యువ నేతకు కలిసొస్తుందా..?
వైరా నియోజకవర్గంలో 35 వేలకు పైగా ఓట్లు ఉన్న కమ్మ సామాజిక వర్గం నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా కీలకంగానే వ్యవహరిస్తుంది. ఈ సామాజిక వర్గానికి చెందిన లీడర్లకు గెలిచిన ప్రతి ఎమ్మెల్యే రాజకీయ ప్రాధాన్యతనిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కారేపల్లి మండలంలో ఉత్సాహంగా ఉన్న యువనేత గుడిపూడి తిరుమల రావు కు కూడా ఎమ్మెల్యే ప్రాధాన్యతనిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కారేపల్లి మండల కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తక్కువగా ఉండటం కూడా ఎమ్మెల్యే గుడిపూడి కి ప్రాధాన్యతనిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆర్థికంగా బలంగా ఉండడం సేవ చేయాలనే సంకల్పం ఉన్న యువనేత గుడిపూడి తిరుమల రావు రాజకీయ రంగ ప్రవేశం పై కారేపల్లి మండల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.








