శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.
*యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల అనుమానాలు.
* కళాశాల ఎదుట ఉద్రిక్తత.
రంగారెడ్డి, మహా.
రంగారెడ్డి జిల్లా కోహెడ (ఎల్బీనగర్ పరిధి) లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దేవేందర్ అనే విద్యార్థి ఆత్మహత్య వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హనుమకొండలోని తన స్వగృహం నుంచి నాలుగు రోజుల క్రితమే హాస్టల్‌కు తిరిగి వచ్చిన దేవేందర్, నిన్న సాయంత్రం ఊహించని విధంగా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో కాకుండా కళాశాల వసతిగృహంలోని మరో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్న స్థితిలో అతడి మృతదేహం కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చదువులో ఎంతో చురుకుగా ఉండే తమ కుమారుడు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని దేవేందర్ తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏవైనా అదృశ్య కారణాలు ఉన్నాయా అనే కోణంలో వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోరకలిలో కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరు వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దేవేందర్ ఆత్మహత్య చేసుకుంటే, ఆ విషయాన్ని దాచిపెట్టి రాత్రి 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాకుండా, కడుపుకోతతో కన్నవారు కళాశాలకు చేరుకునే లోపే యాజమాన్యం ఆదరాబాదరాగా విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం పరిస్థితుల పట్ల వారి వ్యవహారశైలిని ప్రశ్నార్థకం చేస్తోంది.
విద్యార్థి మృతితో కళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోటి విద్యార్థి అకాల మరణంతో భయాందోళనలకు గురైన మిగతా విద్యార్థులను, పరిస్థితి చేయిజారుతుందని భావించిన యాజమాన్యం హుటాహుటిన వారి ఇళ్లకు పంపించేస్తోంది. మరోవైపు విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు శ్రీచైతన్య కళాశాల వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దేవేందర్ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని, వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.








