భారత రక్షణ వ్యూహంలో చరిత్రాత్మక ఘట్టం.
* శత్రువుల గుండెల్లో గుబులు రేపుతూ సర్వసన్నద్ధంగా అణ్వస్త్రాలు.
* 190కి చేరిన అణు సామర్థ్యం.
* జలగర్భంలోనూ నిరంతర నిఘా.
ఢిల్లీ, మహా.
దేశ భద్రత, సార్వభౌమాధికార రక్షణే ధ్యేయంగా భారతదేశం తన అణు విధానంలో కీలకమైన, చరిత్రాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా మునుపెన్నడూ లేని రీతిలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసింది. ప్రపంచ శాంతి, ఆయుధాల నియంత్రణపై అధ్యయనం చేసే ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) తన తాజా నివేదికలో ఈ సంచలనాత్మక విషయాలను వెల్లడించింది. భారత సైనిక చరిత్రలో తొలిసారిగా ప్రయోగానికి ఏమాత్రం సమయం తీసుకోకుండా తక్షణమే విరుచుకుపడేలా 12 అణుబాంబులను సర్వసన్నద్ధంగా ఉంచినట్లు సిప్రి జూన్ 8న విడుదల చేసిన నివేదిక కుండబద్దలు కొట్టింది.
*సాంప్రదాయ విధానానికి స్వస్తి.. క్షణాల్లో ప్రతీకారం.
దశాబ్దాలుగా భారతదేశం అత్యంత బాధ్యతాయుతమైన అణు విధానాన్ని అనుసరిస్తోంది. శాంతియుత సమయాల్లో అణు బాంబులను (వార్‌హెడ్లను), వాటిని మోసుకెళ్లే క్షిపణులను లేదా యుద్ధ విమానాలను వేర్వేరు సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచడం మన ఆనవాయితీ. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటిని అనుసంధానించేవారు. కానీ, ప్రస్తుతం ఇరుగుపొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ల నుంచి ఎదురవుతున్న ద్వంద్వ ముప్పు (టూ ఫ్రంట్ వార్ త్రెట్) దృష్ట్యా భారత్ తన వ్యూహాలకు పదును పెట్టింది. సిప్రి తాజా నివేదిక ప్రకారం, అణ్వస్త్రాలను నేరుగా ప్రయోగ వ్యవస్థలతో అనుసంధానించి, సైనిక స్థావరాలు లేదా అత్యంత రహస్యమైన భూగర్భ క్షిపణి కేంద్రాల్లో మోహరించారు. దీనివల్ల శత్రువుల దాడి జరిగిన క్షణాల్లోనే అణు ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది.
* 190కి చేరిన అణు సామర్థ్యం.. జలగర్భంలోనూ నిరంతర నిఘా.
భారతదేశ అణు ఆయుధ సంపత్తి క్రమంగా, వ్యూహాత్మకంగా పెరుగుతోందని సిప్రి నివేదిక స్పష్టం చేసింది. 2026 జనవరి నాటికి మన దేశం వద్ద ఉన్న మొత్తం అణు బాంబుల సంఖ్య దాదాపు 190కి చేరుకుందని అంచనా వేసింది. ఇది కేవలం సంఖ్యాపరమైన పెరుగుదల మాత్రమే కాదు, గుణాత్మకమైన ఆధునికీకరణ కూడా. నేల, నింగి, సముద్రం.. ఇలా మూడు మార్గాల ద్వారా (న్యూక్లియర్ ట్రెయాడ్) అణు దాడులు చేయగల అద్భుత సామర్థ్యాన్ని భారత్ మరింత మెరుగుపరుచుకుంది. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ వంటి స్వదేశీ అణు జలాంతర్గాముల్లో ఈ సరికొత్త, అత్యాధునిక అణుబాంబులను మోహరించి సముద్ర గర్భంలో నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే వాయుమార్గం ద్వారా దాడి చేసేందుకు మిరాజ్, రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను సైతం అణు వాహకాలుగా తీర్చిదిద్దారు.
* కంటైనర్ సాంకేతికతతో అద్భుత ఫలితాలు.
శాంతి సమయంలోనూ క్షిపణులను అణుబాంబులతో అనుసంధానించి ఉంచడం వెనుక భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సాధించిన సాంకేతిక విజయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా క్షిపణులను ముందుగానే కంటైనర్లలో (కానిస్టరైజేషన్) భద్రపరిచి, ప్రయోగానికి సిద్ధంగా ఉంచే సాంకేతికతను భారత్ సొంతం చేసుకోవడం వల్లే ఇది సాధ్యపడింది. అగ్ని-5, అగ్ని-ప్రైమ్ వంటి ఆధునిక క్షిపణులను సీల్ చేసిన క్యాప్సూల్స్ లేదా కంటైనర్లలో ఉంచడం ద్వారా వాతావరణ పరిస్థితులు వాటిపై ప్రభావం చూపవు. అంతేకాకుండా, భారీ వాహనాలు లేదా రైళ్ల ద్వారా ఈ కంటైనర్లను దేశంలోని ఏ మూలకైనా సులభంగా, రహస్యంగా తరలించి.. శత్రువు ఊహించని ప్రదేశం నుంచి బటన్ నొక్కిన క్షణాల్లోనే ప్రయోగించవచ్చు.
* నో ఫస్ట్ యూజ్.. బాధ్యత గల మహాశక్తిగా గుర్తింపు.
అణ్వస్త్రాలను సర్వసన్నద్ధం చేసినప్పటికీ, భారతదేశం ఏమాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదని, తన ప్రాథమిక సిద్ధాంతమైన నో ఫస్ట్ యూజ్ (మొదట మేం ప్రయోగించం) విధానానికే కట్టుబడి ఉందని సిప్రి తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ సిద్ధాంతం ప్రకారం, ఎదుటి దేశం ముందుగా అణు దాడి చేస్తే తప్ప, భారతదేశం తన అణ్వస్త్రాలను బయటకు తీయదు. ఒకవేళ ఏ శత్రు దేశమైనా దుస్సాహసానికి ఒడిగట్టి భారత్‌పై లేదా భారత భద్రతా బలగాలపై అణు దాడి చేస్తే.. ఊహించని స్థాయిలో, కోలుకోలేని విధంగా భారీ ప్రతీకార దాడి (మాసివ్ రిటాలియేషన్) చేసేందుకే ఈ 12 అణుబాంబులను సిద్ధంగా ఉంచారు. ప్రపంచ దేశాలతో ఆయుధ పోటీకి దిగకుండా, కేవలం తమ దేశ భద్రతను కాపాడుకుంటూ, శత్రువుల కుట్రలను నివారించేందుకు మాత్రమే పరిమితమైన కచ్చితమైన నిరోధక శక్తిని (క్రెడిబుల్ మినిమమ్ డిటెరెన్స్) భారత్ కొనసాగిస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.








