అవినీతి రహిత పాలనతో మోదీ సరికొత్త చరిత్ర.
* నెహ్రూ రికార్డు అధిగమించడంపై దేశమంతా హర్షం.
* కేంద్రమంత్రి బండి సంజయ్.
* 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేసిన మహానేత ప్రధాని మోదీ.
* 2047 వరకు ఆయనే ప్రధానిగా కొనసాగాలి.
హైదరాబాద్, మహా.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 4,399 రోజులు పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన కొనియాడారు. సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు దేశ ప్రగతి, మరోవైపు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గడిచిన పన్నెండేళ్లుగా మోదీ సాగిస్తున్న అప్రతిహత ప్రస్థానం నవభారత నిర్మాణానికి బాటలు వేసిందని శ్లాఘించారు.
**నెహ్రూ కాలం నాటి అరాచకత్వానికి స్వస్తి..**
గత పాలకుల తీరుపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి జవహర్‌లాల్ నెహ్రూ కాలమంతా అవినీతి, అరాచకాలతో దేశం ఎంతో నష్టపోయిందని ఆయన ఆరోపించారు. నాటి పాలకులు దేశ సంపదను దోచుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. అయితే, ఆ చీకటి రోజులకు స్వస్తి పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ గత పన్నెండేళ్లుగా ఒక్క అవినీతి మరక కూడా లేకుండా అత్యంత పారదర్శకమైన, పటిష్టమైన పరిపాలనను అందిస్తున్నారని కొనియాడారు. అవినీతికి అస్సలు తావులేని సుశాసనాన్ని దేశ ప్రజలకు పరిచయం చేసిన ఘనత మోదీదేనని స్పష్టం చేశారు.
**పేదరిక నిర్మూలనలో సరికొత్త రికార్డు**
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాల వల్లే దేశంలో అద్భుతమైన మార్పులు సాధ్యమయ్యాయని బండి సంజయ్ వివరించారు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 25 కోట్ల మందిని పేదరికం నుండి విజయవంతంగా బయటకు తీసుకువచ్చిన ఏకైక అపర భగీరథుడు నరేంద్ర మోదీ అని ప్రశంసించారు. పేదల కన్నీళ్లు తుడవడమే పరమావధిగా సాగుతున్న మోదీ నాయకత్వం దేశానికి మరింత కాలం అవసరమని అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు, ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసేందుకు 2047 వరకు నరేంద్ర మోదీయే దేశ ప్రధానమంత్రిగా నిరంతరాయంగా కొనసాగాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
ఇదే సందర్భంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించారు. ఈ అంశం ప్రస్తుతం పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉందని, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ ఈ వ్యవహారంపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.







