దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం.
* అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానిగా మోదీ రికార్డు.
* నెహ్రూ రికార్డును బద్దలుకొట్టిన నరేంద్ర మోదీ.
* 4,399 రోజుల సుదీర్ఘ పదవీకాలంతో అరుదైన ఘనత.
* మల్కాజిగిరి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు.
హైదరాబాద్, మహా.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది. దేశ చరిత్రలోనే నిరంతరాయంగా అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్దాస్ మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించి, సుమారు 4,399 రోజుల పాటు సుదీర్ఘంగా పదవీకాలాన్ని పూర్తి చేసుకుని ఆయన ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఎన్నికైన ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ, స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ నేడు సగర్వంగా అధిగమించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా గడిచిన పన్నెండేళ్లుగా నిరంతరాయంగా సేవలందిస్తున్న మోదీ, భారత రాజకీయ యవనికపై తనకంటూ ఒక ప్రత్యేక పేజీని సుస్థిరం చేసుకున్నారు.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ప్రధాని ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్లో గల ప్రసిద్ధ శివాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరమశివుడికి అభిషేకాలు, మహా హారతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరిపించారు. అనంతరం తెలంగాణ యావత్ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో దేశానికి మరిన్ని ఉన్నతమైన సేవలందించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు, ప్రధాని మోదీ పన్నెండేళ్ల సువర్ణ పాలనను కొనియాడారు. ప్రజాసేవ, సుశాసనం, దేశ అంతర్గత, సరిహద్దు భద్రత.. ఇలా ప్రతి కీలకమైన రంగంలోనూ నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. గడిచిన పుష్కర కాలంలో మోదీ తీసుకున్న సాహసోపేతమైన, విప్లవాత్మక నిర్ణయాల ఫలితంగానే నేడు భారతదేశం ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని గుర్తుచేశారు. ఆయన దార్శనికత, పటిష్టమైన నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ సాధన దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మోదీకి దేవుని ఆశీస్సులు, వందకోట్లకు పైగా ఉన్న భారతీయ పౌరుల దీవెనలు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ సరికొత్త మైలురాయిని అధిగమించిన శుభతరుణంలో తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గం, మారుమూల మండలాల్లో సైతం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ రోజును ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పాటు అందించిన పాలనతో పోలిస్తే, మోదీ నేతృత్వంలోని సర్కార్ పాలన దేశ దశను, దిశను సమూలంగా మార్చేసిందని పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. పారదర్శకమైన పాలన, దళారీ వ్యవస్థ లేని సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన భారత కీర్తి ప్రతిష్టలు మోదీ సుశాసనానికి నిదర్శనమని వారు గర్వంగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ చారిత్రాత్మక సంబరాల్లో అత్యుత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, అశేష కార్యకర్తలందరికీ రాంచందర్ రావు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.







