Mahaa Daily Exclusive

  ఒకటో తేదీనే జీతాలు చారిత్రాత్మ‌కం…

Share

  • ఒకటో తేదీనే జీతాలు చారిత్రాత్మ‌కం
  • ఉద్యోగుల సంక్షేమం ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న‌ చిత్త‌శుద్ధి, నిబద్ధతకు నిదర్శనం
  • సకాలంలో జీతాల చెల్లింపుతో.. ఉద్యోగుల్లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెరుగుతుంది
  • ఈఎంఐలు, పెనాల్టీల భారం నుంచి ఉపశమనం
  • మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, మహా : రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఇతర గౌరవ వేతన సిబ్బంది అందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం చారిత్రాత్మ‌కమైన‌ద‌ని పర్యాటక, సాంస్కృతిక, పురావ‌స్తు, ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ‌ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ నిర్ణయం ప్ర‌భుత్వ, పొరుగు సేవ‌లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిశ్చితత్వాన్ని, వారి కుటుంబాల‌కు కొండంత బ‌లాన్ని ఇస్తుంద‌ని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స‌మయానికి జీతాల చెల్లింపుల‌పై ఆర్థిక శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు.. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి నిదర్శనమని స్ప‌ష్టం చేశారు.

గత బీఆర్ఎస్ పాల‌న‌లో జీతాల చెల్లింపుల్లో అనిశ్చితి కారణంగా ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నార‌ని మంత్రి జూపల్లి గుర్తుచేశారు. నెల నెలా ఇల్లు, వాహన రుణాల ఈఎంఐలు సకాలంలో డిడ‌క్ట్ కాకపోవడం, చెక్కులు బౌన్స్ అయ్యి బ్యాంకులు కఠినమైన జరిమానాలు విధించడం వంటి సమస్యలతో ఉద్యోగుల‌కు అద‌న‌పు భారం ప‌డేద‌న్నారు. అద్దెలు, స్కూలు ఫీజులు, వైద్య ఖర్చులు వంటి కనీస అవసరాల కోసం ప్రతి నెలా ఆరంభంలో ఉద్యోగులు పడే ఇబ్బందుల‌ను ప్రజా ప్రభుత్వం గుర్తించిందని ఆయన చెప్పారు. ఉద్యోగుల ఈ దీర్ఘకాలిక ఆందోళనలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన్ప‌టి నుంచి.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీనే జీతాలు చెల్లిస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా, కాంట్రాక్ట్, పొరుగు సేవ‌ల తాత్క‌లిక ఉద్యోగులు, సిబ్బందికి వర్తింపజేయడం ఉద్యోగుల ప‌ట్ల ఈ ప్ర‌భుత్వానికి ఉన్న నిబద్ధ‌త‌కు అద్దం ప‌డుతుంద‌ని తెలిపారు.

క్రమం తప్పకుండా, ఖచ్చితమైన సమయానికి వేతనాలు అందడం వల్ల ఉద్యోగులు తమ ఆర్థిక బడ్జెట్‌ను మెరుగ్గా ప్రణాళిక చేసుకోవచ్చని, మంచి క్రెడిట్ రికార్డులను, సిబిల్ స్కోరును కాపాడుకుంటూ తమ ఆర్థిక బాధ్యతలను సకాలంలో నెరవేర్చుకోవచ్చని పేర్కొన్నారు. సమయానికి జీతాలు అందడం వల్ల కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని, కొనుగోలు శక్తి మెరుగవుతుందని, నెలవారీ ఖర్చుల నిర్వహణకు సంబంధించిన ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని, వారి కొనుగోలు శక్తి పెరిగి క్షేత్రస్థాయిలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంక్షేమ ఆధారిత సంస్కరణను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మ‌ల్లు భట్టివిక్రమార్కకు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, సిబ్బంది ప‌క్షాన ఆయన కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.