Mahaa Daily Exclusive

  ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్…

Share

  • ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్
  • హైదరాబాద్‌లో రాజ్ కేసిరెడ్డి ఇల్లు సహా 10 చోట్ల సోదాలు
  • మనీలాండరింగ్ గుట్టు అంతా పట్టేసిన ఈడీ
  • జగన్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం వ్వబోతున్నారా?

అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన వేల కోట్ల మద్యం రవాణా, సిండికేట్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పక్కా ఆధారాలతో రంగంలోకి దిగింది. గతంలో రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేయడంతో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్‌పై వచ్చిన ఈ స్కామ్ సూత్రధారి, వైఎస్సార్‌సీపీ హయాం నాటి మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని ఇప్పుడు ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టుతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నానక్‌రామ్‌గూడలోని రాజ్ కేసిరెడ్డి నివాసంతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.

మనీలాండరింగ్ కోణం గుట్టు రట్టు

ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈ మనీలాండరింగ్ కేసు అత్యంత కీలకమైనదిగా మారుతోంది. కేవలం మద్యం పాలసీలోనే కాకుండా, లిక్కర్ సెంట్రలైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ టెండర్ల ద్వారా సుమారు రూ. 349 కోట్ల మేర అక్రమాలకు పాల్పడి, ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లించారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థలను ఫ్రంట్‌గా వాడుకుని, తెరవెనుక రాజ్ కేసిరెడ్డి సిండికేట్ 95 శాతం పైగా లాభాలను హవాలా, మనీలాండరింగ్ మార్గాల ద్వారా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులలోకి పెట్టుబడిగా మార్చినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఓల్విక్, అరోయో, ఈజీలోడ్ వంటి డమ్మీ కంపెనీల గుట్టును అధికారులు రట్టు చేసినట్లుగా తెలుస్తుంది.

రాజ్ కేసిరెడ్డికే అన్నీ తెలుసని విజయసాయిరెడ్డి వాంగ్మూలం

ఈ కేసులో గతంలో ఈడీ జరిపిన ఏడు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం వైఎస్సార్‌సీపీ మాజీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఈ కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ పాత్రను నేరుగా వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డే ‘అన్నీ తానై నడిపిన అసలు పాత్రధారి’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకే తాను సజ్జల శ్రీధర్ రెడ్డికి రూ. 100 కోట్లు సర్దాల్సి వచ్చిందని, విజయసాయిరెడ్డి ఈడీకి వాంగ్మూలం ఇవ్వడం వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారింది.

త్వరలో జగన్‌కు నోటీసులు?

ఈడీ తాజాగా అటాచ్ చేసిన దాదాపు రూ. 441 కోట్ల విలువైన ఆస్తులు, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా ఆధారంగా ఈ కుంభకోణంలోని అన్ని వేళ్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వైపే చూపుతున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగం ద్వారా డిస్ట్రిలరీల నుంచి రూ. 3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు, హవాలా లావాదేవీల లూప్‌ను ఈడీ బ్రేక్ చేయడంతో స్కామ్ వెనుక ఉన్న అసలు ‘పెద్దల’ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతిమ లబ్దిదారు ఎవరన్నది తేలేనా?

రాజ్ కేసిరెడ్డి కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. మద్యం వ్యాపారంలో జే-బ్రాండ్స్ పేరిట నాసిరకం లిక్కర్ అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ సంపాదించిన ఈ వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము చివరకు ఏ ఏ ఖాతాల్లోకి వెళ్ళిందనే పూర్తి రూట్ మ్యాప్‌ను ఈడీ బహిర్గతం చేయనుంది. త్వరలోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఈడీ విచారణ నోటీసులు జారీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.