Mahaa Daily Exclusive

  స్వచ్ఛ ఇంధనాలకు పెద్దపీట…

Share

స్వచ్ఛ ఇంధనాలకు పెద్దపీట.
* అధిక ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు.
*ఈ22 నుంచి ఈ30 రకాలకు వర్తింపు.
* పర్యావరణహిత ఇంధనాలకు మరింత ఊతం.
ఢిల్లీ, మహా.
దేశీయంగా స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనాలకు ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపును ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్‌ మిశ్రమం ఉన్న పెట్రోల్‌పై ఈ ప్రయోజనం వర్తించనుంది. ప్రధానంగా ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన రకాలకు కేంద్రం ఈ పన్ను మినహాయింపును వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు, పర్యావరణహితమైన స్వదేశీ ఇంధనాల వాడకాన్ని పెంచే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. తాజా పన్ను మినహాయింపుతో దేశంలో అధిక ఇథనాల్‌ ఇంధన వినియోగానికి భారీగా ఊతం లభించనుంది. ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొన్ని రోజుల క్రితమే ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్‌ మిశ్రమాలకు కొత్త నాణ్యత ప్రమాణాలను వెలువరించింది. ఇథనాల్‌ శాతం, ఆక్టేన్‌ రేటింగ్‌, సల్ఫర్‌ పరిమితులు, భద్రతా నిబంధనలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ పన్ను మినహాయింపు కూడా తోడవడంతో అధిక ఇథనాల్‌ మిశ్రమాలకు సాంకేతికంగానే కాకుండా ఆర్థికంగానూ పూర్తి మద్దతు లభించినట్లయింది.
దేశవ్యాప్తంగా ఇథనాల్‌ మిశ్రమాల కార్యక్రమం శరవేగంగా అమలు జరుగుతోంది. 2018లో జాతీయ బయోఫ్యూయల్‌ విధానాన్ని తీసుకొచ్చిన కేంద్రం, 2022లో దానికి కీలక సవరణలు చేసింది. తొలుత 2030 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆచరణలో వస్తున్న వేగాన్ని బట్టి ఆ గడువును 2025-26 నాటికే చేరుకునేలా ముందుకు తీసుకురావడం గమనార్హం. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు సైతం 2022 జూన్‌ నాటికే 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నాయి. ఆ తర్వాత నుంచి దేశంలో ఇథనాల్‌ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
అయితే, ఇథనాల్‌ మిశ్రమాల వాడకం వల్ల వాహనాల మైలేజీ, ఇంజిన్‌ పనితీరుపై ప్రభావం పడుతుందేమోనని గతంలో కొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆటోమొబైల్ నిపుణులు, వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్) స్పందిస్తూ.. ఈ20 వంటి అధిక ఇథనాల్ ఇంధనాల వల్ల ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తవని స్పష్టం చేసింది. ఇంజిన్ పనితీరుపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ఈ తరహా మిశ్రమాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు భరోసా ఇచ్చింది.