స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం..
* రాత్రికిరాత్రే కోటీశ్వరులు కానున్న 4,400 మంది ఉద్యోగులు!
ఢిల్లీ, మహా.
ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ త్వరలో స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. అంచనాల ప్రకారం ఈ ఐపీఓ విజయవంతమైతే సంస్థలో పనిచేస్తున్న సుమారు 4,400 మంది ఉద్యోగులు రాత్రికిరాత్రే మిలియనీర్లుగా (కోటీశ్వరులుగా) అవతరించనున్నారు. కార్పొరేట్ ప్రపంచంలోనే ఇది ఒక సంచలన పరిణామంగా నిలిచిపోనుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
*భారీ వ్యాల్యుయేషన్.. రికార్డు స్థాయి సంపద సృష్టి*
స్పేస్‌ఎక్స్ ఐపీఓలో ఒక్కో షేరు ధరను సుమారు 135 డాలర్లుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధర వద్ద కంపెనీ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ అంచనాల ప్రకారం.. సంస్థలోని ప్రస్తుత, మాజీ ఉద్యోగుల్లో ఏకంగా 4,400 మంది తమ స్టాక్ హోల్డింగ్స్ ద్వారా మిలియనీర్లు (మిలియన్ డాలర్లకు పైగా సంపద) అవుతారని ‘న్యూయార్క్ టైమ్స్’ తన నివేదికలో వెల్లడించింది. వీరిలో దాదాపు 400 మంది ఉద్యోగుల సంపద 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం.
సాధారణంగా ఐపీఓలలో కంపెనీ వ్యవస్థాపకులు లేదా కొద్దిమంది ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే అత్యధికంగా లాభపడతారు. కానీ, స్పేస్‌ఎక్స్ విషయంలో ఇది పూర్తిగా భిన్నమని, ఒకే కంపెనీలో 400 మందికి పైగా 100 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉండటం చాలా అరుదైన విషయమని హిల్.కామ్ సీఈఓ ఆండ్రూ బెన్సన్ వ్యాఖ్యానించారు. స్పేస్‌ఎక్స్ ఎంత భారీ సంపదను సృష్టించిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన వివరించారు.
* నగదుకు బదులు ఈక్విటీ..*
స్పేస్‌ఎక్స్ తన ఉద్యోగులకు నగదు కంటే ఎక్కువగా ఈక్విటీ (షేర్లు) రూపంలో పరిహారం చెల్లించడం వల్లే ఈ అద్భుతం సాధ్యమైంది. ఉదాహరణకు 2011లో స్పేస్‌ఎక్స్‌లో చేరిన ట్రెవర్ హైస్ అనే ఉద్యోగికే ఈ స్థాయిలో లబ్ధి చేకూరనుంది. అప్పట్లో సంస్థ చాలా చిన్నది కావడంతో ఆయనకు పరిహారంలో భాగంగా లక్ష షేర్లను కేటాయించారు. ఐపీఓ షేరు ధర 135 డాలర్లుగా ఉంటే.. ఆ ఒక్క ఉద్యోగి షేర్ల విలువే ఏకంగా 13.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 129 కోట్లు) చేరుకుంటుంది. ఐపీఓ అనంతరం ఈ భారీ సంపదంతా ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవహించే అవకాశం ఉందని రియల్టర్.కామ్ సీనియర్ ఆర్థికవేత్త హన్నా జోన్స్ అంచనా వేశారు.
*చిన్న మదుపరులకు పెద్దపీట*
ఈ భారీ పబ్లిక్ ఇష్యూలో రిటైల్ (చిన్న) ఇన్వెస్టర్లకు సైతం యాజమాన్యం పెద్దపీట వేయనుంది. బడా ఐపీఓలలో సాధారణంగా రిటైల్ మదుపరులకు కేవలం 5 నుంచి 10 శాతం షేర్లు మాత్రమే కేటాయిస్తుంటారు. అయితే, స్పేస్‌ఎక్స్ ఐపీఓలో ఏకంగా 30 శాతం షేర్లను వారికోసమే రిజర్వ్ చేయనున్నట్లు సమాచారం. దీనికి తోడు ఫిడిలిటీ వంటి సంస్థల ద్వారా కేవలం 2,000 డాలర్ల పెట్టుబడితో కూడా సామాన్యులు ఈ ఐపీఓలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం మరో విశేషం.
*740 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ వాటా*
ఈ ఐపీఓతో స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సంపద సైతం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఆ కంపెనీలో ఆయనకు 42 శాతం వాటా ఉంది. ఐపీఓ తర్వాత కంపెనీ విలువ 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరితే.. ఒక్క మస్క్ వాటా విలువే 740 బిలియన్ డాలర్లుగా నమోదు కానుంది. గత ఏడాది 800 బిలియన్ డాలర్లుగా ఉన్న స్పేస్‌ఎక్స్ విలువ.. ఫిబ్రవరిలో మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ” విలీనంతో 1.25 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ మెగా ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి సుమారు 75 బిలియన్ డాలర్ల మేర నిధులను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే నిజమైతే స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా స్పేస్‌ఎక్స్ సరికొత్త రికార్డును నెలకొల్పుతుంది.







