కవిత కొత్త పార్టీకి పేరు చిక్కులు.
* ‘టీఆర్ఎస్’పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం.
* మహారాష్ట్ర నుంచి కూడా పోటీ.
* ఈసీకి వెల్లువెత్తిన వందలాది ప్రజా అభ్యంతరాలు.
హైదరాబాద్, మహా.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే గట్టి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చుట్టూ తీవ్ర వివాదం నెలకొనడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామాన్ని (అక్రోనిం) కవిత కొత్త పార్టీకి కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పలు వైపుల నుంచి భారీగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రాష్ట్ర సమితి) అనే పేరు సుదీర్ఘ కాలం సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రతో, ప్రజల భావోద్వేగాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య ప్రజలు ఇప్పటికీ తమ పార్టీని ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని, కాబట్టి ఆ పేరును వేరొకరికి కేటాయించడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
మరోవైపు, కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి కేవలం ఒక రోజు ముందే.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ అనే సంస్థ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరు కోసమే ఈసీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ అనే వ్యక్తి ఈ మేరకు దరఖాస్తు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇవి మాత్రమే కాకుండా, కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పత్రికల్లో ఇచ్చిన బహిరంగ ప్రకటన ఆధారంగా సుమారు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు (పబ్లిక్ అబ్జెక్షన్స్) కేంద్ర ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే ‘తెలంగాణ రాజ్య సమితి’ పేరుతో నమోదైన మరో ప్రాంతీయ పార్టీ కూడా.. ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామాన్ని వాడటంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో, తమ వైపు ఉన్న సాంకేతిక, చట్టపరమైన వాదనలను వినిపించేందుకు కవిత ప్రతినిధుల బృందం త్వరలోనే దిల్లీలో ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతోంది. ఒకే పేరు కోసం ఇన్ని వైపుల నుంచి అభ్యంతరాలు, పోటీ వ్యక్తమవుతున్న తరుణంలో.. కవిత తన కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ అనే ప్రతిష్టాత్మక అక్షరాలను దక్కించుకోగలుగుతారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.








