Mahaa Daily Exclusive

  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌….

Share

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.
* అగ్రస్థానంలోనే టీమిండియా.
* వార్షిక అప్‌డేట్‌ తర్వాతా నంబర్‌-1 స్థానం పదిలం.
* రెండో స్థానంలో న్యూజిలాండ్‌.
* నాలుగో స్థానానికి చేరిన దక్షిణాఫ్రికా..
* ఐదో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్‌.

దుబాయ్,మహా.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు తన అగ్రస్థానాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంది. ఐసీసీ నిర్వహించిన వార్షిక రేటింగ్స్ అప్‌డేట్‌ తర్వాత కూడా టీమిండియా నంబర్‌-1 స్థానంలోనే కొనసాగుతోంది. అయితే, రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టుతో పోలిస్తే భారత్‌కు ఉన్న పాయింట్ల ఆధిక్యం మాత్రం ఈసారి కొంత తగ్గింది.
ఈ వార్షిక అప్‌డేట్‌కు ముందు భారత జట్టు 119 రేటింగ్‌ పాయింట్లతో ఉండగా.. తాజా సమీక్ష తర్వాత అది 118 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో రెండో స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్‌కు రెండు పాయింట్లు కలిసిరావడంతో ఆ జట్టు 113 పాయింట్లతో నిలిచింది. దీనివల్ల గతంలో ఇరు జట్ల మధ్య ఉన్న ఎనిమిది పాయింట్ల వ్యత్యాసం కాస్తా.. ఇప్పుడు ఐదు పాయింట్లకు పరిమితమైంది. ఇక ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో యథాతథంగా మూడో స్థానంలోనే కొనసాగుతోంది.
తాజా వన్డే ర్యాంకింగ్స్ టాప్‌-10 జాబితాలో ప్రధాన మార్పు నాలుగో స్థానంలో చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు 102 పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంకుకు చేరుకోగా.. అంతవరకు అక్కడ ఉన్న పాకిస్థాన్‌ జట్టు 98 పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది. ఇక దిగువ ర్యాంకింగ్స్‌లోనూ కొన్ని ఆసక్తికర మార్పులు కనిపించాయి. ఐర్లాండ్‌ జట్టు ఒక స్థానం ఎగబాకి 11వ ర్యాంకుకు చేరడం ద్వారా జింబాబ్వేను వెనక్కి నెట్టింది. అలాగే అసోసియేట్ దేశమైన అమెరికా సైతం అద్భుత ప్రదర్శనతో 13వ స్థానానికి చేరుకుని స్కాట్లాండ్‌ను అధిగమించింది.
భారత జట్టు కేవలం వన్డేల్లోనే కాకుండా, అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ ప్రపంచంలోనే నంబర్‌-1 జట్టుగా తన హవా కొనసాగిస్తుండటం విశేషం. మరోవైపు, సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. మహిళల క్రికెట్‌కు వస్తే వన్డే, టీ20 ఫార్మాట్లు రెండింటిలోనూ ఆస్ట్రేలియా మహిళల జట్టు తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నంబర్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.